Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు కొత్త కాక పుట్టిస్తున్న కోదండ‌రాం

By:  Tupaki Desk   |   1 Jun 2016 1:05 PM GMT
కేసీఆర్‌కు కొత్త కాక పుట్టిస్తున్న కోదండ‌రాం
X
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలోని వివిధ వేదిక‌ల మ‌ధ్య ఉన్న వైరుద్యాన్ని ప్ర‌స్పుటం చేస్తోంది. టీఆర్ ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తుండ‌గా మ‌రోవైపు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన తెలంగాణ రాజ‌కీయ జేఏసీ త‌న‌దైన శైలిలో వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌యింది.

రాష్ట్ర ఆవిర్భావ సంద‌ర్భాన్ని ‘ఉద్యమకారుల ఆత్మగౌరవ దినం’ తెలంగాణ జేఏసీ పాటిస్తోంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండ‌రాం అధ్యక్షతన రాష్ట్ర ఆవిర్భావానికి ముందురోజు ట్యాంక్‌ బండ్‌ పై అంబేద్కర్‌ విగ్రహం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అంబేద్కర్‌ విగ్రహం నుంచి గన్ పార్క్‌ వరకూ ర్యాలీ - జెండా ఆవిష్కరణ నిర్వహిస్తారు. ఇదే స‌మ‌యంలో జిల్లాలు - మండలాలు - గ్రామాల్లోనూ స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న‌ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా టీజేఏసీ పాల్గొన‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. అదే క్ర‌మంలో టీజేఏసీని సైతం ప్ర‌భుత్వం ఆహ్వానించ‌లేద‌ని తెలుస్తోంది. ఇలా దూరం పెరుగుతున్న సంద‌ర్భంలో ఉద్య‌మ‌కారుల ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని జేఏసీ చైర్మ‌న్ ఎత్తుకోవ‌డం ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డ‌మేన‌ని భావిస్తున్నారు.