Begin typing your search above and press return to search.

''టీ ఉద్యోగాల భ‌ర్తీ'' పై నిర‌స‌న !

By:  Tupaki Desk   |   27 July 2015 7:06 AM GMT
టీ ఉద్యోగాల భ‌ర్తీ పై  నిర‌స‌న !
X
తెలంగాణ ప్రభుత్వం 15 వేల ఉద్యోగాల నియామాకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యువ‌త పెద్ద సంఖ్య‌లో హ‌ర్షం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ఇందుకు త‌గ్గ నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్న‌ట్లు కూడా స‌మాచారం. అయితే నిజంగానే నిరుద్యోగ యువత ఆనందంగా ఉందా అంటే అవున‌నే స్పంద‌న పూర్తి స్థాయిలో రావ‌డంలేదు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ర్టంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే.. కేవలం 15000 భ‌ర్తీ చేయ‌డం సమంజసం కాదని వేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వపరంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే నిర్ణయానికి వేదిక వచ్చింది. సర్కార్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా ఎలా వ్యవహరించాలనే అంశంపై విద్యావంతుల వేదిక సుదీర్ఘంగా చర్చించింది.

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని టీ జాక్ ఛైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించిన నోటిఫికేషన్ల ద్వారా కేవలం 20 శాతం యువతకు మాత్రమే అర్హత ఉంటుందని, అందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో జిల్లాలోనూ సదస్సులు నిర్వహించి, నవంబర్ రెండో వారంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. మిషన్ కాకతీయ తరహాలో నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వేదిక అభిప్రాయపడింది.