Begin typing your search above and press return to search.

పాతోళ్లను మరవకనే కొత్త పోరాటమంటున్న మాష్టారు

By:  Tupaki Desk   |   27 March 2016 10:46 AM GMT
పాతోళ్లను మరవకనే కొత్త పోరాటమంటున్న మాష్టారు
X
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అధికారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిన టీజేఏసీ కీలక నేత ప్రొఫెసర్ కోదండరాం మైండ్ సెట్ అందరికి తెలిసిందే. తెలంగాణ కోసం పని చేయాలన్న ఆలోచన తప్ప మరెలాంటి అధికారాన్ని కోరుకోని ఆయన.. పదవులకు దూరంగా ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. కొత్త ప్రభుత్వానికి కొంతకాలం టైం ఇచ్చి.. అప్పటికి మార్పు లేకపోతే గళం విప్పాలని ఆయన అనుకున్నట్లు చెబుతారు.

ఇందుకు తగ్గట్లే ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీని సైలంట్ గా ఉంచి.. ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరానికి తగ్గట్లుగా ఆచితూచి విమర్శలు చేస్తూ.. అప్పుడప్పుడు మీడియాలో తళుక్కుముంటున్న మాష్టారి వైఖరి ఎప్పటికైనా ఇబ్బందే అనుకున్నారేమో కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో జేఏసీని ముక్కలు చేసే దిశగా పావులు కదుపుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వాదనకు బలం చేకూరేలా.. ఈ మధ్యన టీజేఏసీలోని పలు సంఘాల వారు తాము బయటకు వచ్చేసినట్లుగా ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీజేఏసీ సమావేశాల్ని కోదండం మాష్టారు వరుసగా నిర్వహిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. జేఏసీ అడ్రస్ గల్లంతు కాకుండా ఉండేలా చేయటంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయటంపై ఆయన మరింతగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా టీజేఏసీ సమావేశాన్నినిర్వహించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరాం.. కీలక వ్యాఖ్యలు చేశారు. జేఏసీ నుంచి బయటకు వెళ్లిన వారిపై విమర్శలు చేయమని.. ఉద్యమ సమయంలో వారు చేసిన కృషిని మర్చిపోమని చెప్పుకొచ్చారు. ఇక.. తెలంగాణ ప్రజల తరఫున కొత్తగా పోరాటం చేస్తామన్న ఆయన.. ఆ పనిని ఎవరు చేసినా వారితో భాగస్వామ్యం అవుతామని చెబుతున్నారు. తన ఉనికిని ప్రశ్నగా మార్చాలని భావించే శక్తుల్ని కోదండం మాష్టారు అంత తేలిగ్గా వదిలేయరు కదా?