Begin typing your search above and press return to search.

ప్రొఫెసర్ కూడా ఫైరయ్యాడు..నోరు జారకుండానే!

By:  Tupaki Desk   |   7 Oct 2017 1:10 PM GMT
ప్రొఫెసర్ కూడా ఫైరయ్యాడు..నోరు జారకుండానే!
X
ప్రొఫెసర్ కోదండరాం సామాజిక తెలంగాణ కోసం సాగుతున్న ఉద్యమం పేరుతో కొన్ని నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ జనాభిప్రాయాన్ని నిర్మిస్తూ సాగిస్తున్న పోరాటం గులాబీ అధినేత కేసీఆర్ విపరీతమైన చికాకు కలిగించినట్లుగా ఉంది. శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏ రేంజిలో చెలరేగిపోయాడో అందరికీ తెలుసు. ఏకంగా కోదండరాం ను కుక్క అని అభివర్ణిస్తూ పోలికలు తెచ్చి మాట్లాడాడంటే.. ఆయనలో అసహనం తెలుస్తోంది. అయితే కేసీఆర్ దూషణలకు రిటార్టుగా శనివారం నాడు కోదండరాం కూడా రియాక్ట్ అయ్యారు. కాకపోతే ఎక్కడా నోరు జారకుండా చాలా హుందాగా... విమర్శనాత్మకంగా ఆయన మాట్లాడారు.

ఆ మాటకొస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెరాస చేతుల్లో నుంచి ఉద్యమం జారిపోతున్న తరుణంలో.. కీలకంగా రంగప్రవేశం చేసి.. అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి.. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా అందరూ కలిసి తెలంగాణ కోసం ఉద్యమించేలా సంధానకర్త పాత్ర పోషించిన ఘనత ప్రొఫెసర్ కోదండరాం దే! మరో రకంగా చెప్పాలంటే.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి.. కేసీఆర్ తర్వాత.. ప్రజల దృష్టిలో అంత కీలకంగా క్రేజ్ తెచ్చుకున్న నాయకుడు కూడా కోదండరామే! అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలంగాణ వాదులపై ఒత్తిడి తెచ్చి జేఏసీలో భాగస్వాముల్ని చేసి వారిద్వారా అధిష్టానం పై ఒత్తిడి తేవడంలోనూ ఆయన పాత్ర ఉంది. ఇంతా చేస్తే.. ఆయనతో కేసీఆర్ సర్కారు మాత్రం సున్నం పెట్టుకుంది. అందుకు వారి మధ్యన గల కారణాలు ఏవైనప్పటికీ.. కేసీఆర్ విమర్శలు- కోదండరాం ప్రతిస్పందన ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

కోదండరాం మీద నిప్పులు చెరిగిన కేసీఆర్ .. ఆయనను చాలా చవక భాషలో తిట్టిపోశారు. బండి కింద పోతున్న కుక్క కూడా తానే మోస్తున్నానని అనుకుంటది అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు గురవుతోంది. అదే సమయంలో.. కోదండరాం మాత్రం అలాంటి తీవ్రమైన పదజాలం జోలికి పోకుండా.. చాలా సంయమనంతో మాట్లాడుతూ.. సమస్యలకు సమాధానం ఇవ్వకుండా.. దూషణల్తో విరుచుకుపడడం మంచి పద్ధతి కాదని.. సామాజిక తెలంగాణ కోసమే ఇప్పుడు జేఏసీ పోరాడుతున్నదని.. కేసీఆర్ ఏనాటికైనా ప్రజలకు జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుందని చాలా హుందాగా విమర్శలు చేశారు.

కేసీఆర్ నోటి దూకుడు సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే ఆంధ్రోళ్లను ఆయన మనసు నొచ్చుకునేలా ఎన్నో మాటలు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాటలన్నిటికీ తూచ్ అనేశారు. మరి ఇప్పుడు తన ప్రాంతానికే చెందిన కోదండరాంనే తిట్టిపోస్తున్నారు. ఈ తిట్లకు మాత్రం తూచ్ అనే రోజు ఉండదేమో.