Begin typing your search above and press return to search.

మాష్టారి జీవితంలోనే చూడని సమ్మె ఇదేనట

By:  Tupaki Desk   |   2 Sep 2016 10:10 AM GMT
మాష్టారి జీవితంలోనే చూడని సమ్మె ఇదేనట
X
మోడీ సర్కారు కొలువు తీరిన 26 నెలల తర్వాత కార్మిక సంఘాలు చేస్తున్నభారత్ బంద్ నేడు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా జరుగుతున్న ఈ బంద్.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ బంద్ సందర్భంగా జనజీవనం ఇబ్బందులకు గురైంది. బ్యాంకింగ్ సహా పలు సేవల విషయంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలంటూ దేశ వ్యాప్తంగా 18 కోట్ల మంది కార్మికులు.. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనటం తాజా బంద్ ప్రత్యేకతగా చెప్పాలి.

ఈ బంద్ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండం మాష్టారు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.తన జీవితంలో ఇంత పెద్ద సమ్మె చూడలేదన్న కోదండం మాష్టారూ.. ఇంత భారీగా జరుగుతున్న సమ్మె విజయవంతం కావటం గొప్పన్నారు. ప్రభుత్వాలు ఐటీ రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మిగిలిన రంగాల్ని విస్మరిస్తున్నాయని విమర్శించిన కోదండం మాష్టారు.. ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు.

దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమాల్లో ఎన్నో కీలక ధర్నాలు.. బంద్ లు.. కార్యక్రమాలు నిర్వహించిన కోదండం మాష్టారికి బంద్ లేమీ కొత్త కాదు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా.. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే ఆర్టీసీ బస్సులు కానీ తిరిగి ఉంటే సమ్మె ఊసు పెద్దగా తెలీని బంద్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేయటం..జీవితంలో తానింత పెద్ద సమ్మె చూడలేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం కాస్తంత ఆసక్తికరమని చెప్పక తప్పదు.