Begin typing your search above and press return to search.

అదే నవ్వు.. అదే చురుకు.. కోదండం తీరే వేరులే

By:  Tupaki Desk   |   7 Jun 2016 9:57 AM GMT
అదే నవ్వు.. అదే చురుకు.. కోదండం తీరే వేరులే
X
తెలంగాణ ఉద్యమకాలంలో నిత్యం వినిపించిన పేర్లలో అత్యంత కీలకమైన.. ముఖ్యమైన పేరు కోదండరాం. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పేరు వినిపించినా.. వినిపించకున్నా కోదండరాం మాత్రం నిత్యం చురుగ్గా కనిపించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాల్లో తనదైన పాత్రను పోషించిన ఆయన.. సినిమాటిక్ గా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కామ్ గా ఉండటం.. ప్రభుత్వం చేసే పనుల్ని క్షేత్రస్థాయిలో సరి చూసుకోవటం.. పాదయాత్రల్ని నిర్వహించటం.. బడుగు జీవుల బాధల్ని వినటం లాంటివి చేశారు. కొందరు ప్రశ్నలతో రియాక్ట్ కావాలని కోరినా.. రాజకీయం జోలికి వెళ్లకుండా ఇష్యూ గురించి మాట్లాడేవారు. మరికొందరు పాత్రికేయులు తమదైనశైలిలో ప్రశ్నించి.. కోదండం మాష్టారి నుంచి సమాధానం రాబట్టుకునే ప్రయత్నం చేసినా ఆయన ఎక్కడా తొణకలేదు.. బెణకలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయటం.. ఆ ఘాటు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారి రాజకీయ కలకలం చోటు చేసుకుంది. గడిచిన రెండేళ్లలో తెలంగాణ అధికారపక్షం రోజురోజుకీ బలోపేతం కావటమే కాదు.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితికి వచ్చిన దుస్థితి. ఇలాంటి వేళ.. కోదండం మాష్టారి నోటి నుంచి పదునైన వ్యాఖ్యలు రావటం ఒక్కసారిగా అందరి చూపు కోదండం మాష్టారి మీద పడింది.

ఇదిలా ఉంటే.. తమ సర్కారుపై విమర్శలు సంధించిన కోదండం మాష్టారిపై వెనుకా ముందు చూడకుండా చాలానే విమర్శలు చేసేవారు. చివరకు ఉద్యమ సమయంలో కోదండం మాష్టారి చుట్టూ తిరుగుతూ.. ఆయన చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటూ.. ఆయన సూచనల్ని పాటిస్తూ.. ఆయన పట్ల అత్యంత వినయ విధేయతల్ని ప్రదర్శించే ఎంపీ బాల్క సుమన్ సైతం చెలరేగిపోయారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో కోదండం మాష్టారి సూచన కోసం ఒళ్లంతా కళ్లు చేసుకున్నట్లుగా వ్యవహరించిన సుమన్.. ఈ రోజు ఆయనపై చెలరేగిపోవటమే కాదు.. కుబుసం విడిచిన నాగు.. కాంగ్రెస్ ఏజెంటు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన వారు.. తానంటే విపరీతమైన గౌరవ మర్యాదులు ఇచ్చిన నేతల్లో చాలామంది ఈ రోజు అందుకు భిన్నంగా తిట్టిపోసిన వేళ.. మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటే.. ఎవరైనా ఏలా రియాక్ట్ అవుతారు? ఆవేశంతో తమ మీద చేసిన విమర్శలకుకౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ.. కోదండం మాష్టారి వ్యవహారం అందుకు పూర్తి భిన్నం. ఎప్పటిలానే కూల్ గా ఉంటూ.. కూల్ గా నవ్వుతూ.. మీడియాప్రతినిధులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. తాను చెప్పాలనుకున్న నాలుగు మాటల్ని పొడిపొడిగా చెప్పేసి తన దారి తాను వెళ్లిపోయారు కోదండం మాష్టారు. దాదాపు పది మందికి పైనే టీఆర్ ఎస్ ముఖ్యనేతలు మాటల టార్గెట్ చేసిన రోజు తర్వాత కోదండరాం చెప్పిన మాటలేమిటంటే.. విమర్శల గురించి రాజకీయ జేఏసీలో మాట్లాడతాం.. చర్చలు జరుపుతాం.. సమాధానాలు చెబుతాం అనే. మీ ప్రశ్నలకు సమాధానం రేపు అంటూ నర్మగర్భంగా నవ్వుతూ వెళ్లిపోయిన కోదండరాంను చూస్తే.. తెలంగాణ అధికారపక్షానికి అసలుసిసలు విపక్ష అధినేత ఆయనే అవుతారా? అన్న భావన క్షణం పాటు కలగటం ఖాయం. మరి.. క్షణం పాటు కలిగిన భావనను నిజం చేస్తారా? అంటే.. దానికి కాలమే సమాధానం చెప్పాలి.