Begin typing your search above and press return to search.

పాత ట్రెండుపై కోదండరాం కొత్త సెటైర్ ఇది

By:  Tupaki Desk   |   8 Nov 2016 7:16 AM GMT
పాత ట్రెండుపై కోదండరాం కొత్త సెటైర్ ఇది
X
తెలంగాణ రాజ‌కీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం రాజ‌కీయ నాయ‌కులు ముఖ్యంగా అధికార పార్టీపై ఘాటు విమ‌ర్శ చేశారు. ఆయన చేసిన కామెంట్ బాగా లేటనుకోండి. ఇంతకీ ఆయన ఏమంటారంటే అంకెల గారడీతో అభివృద్ధి కాదని - ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధని చెప్పారు. హైదరాబాద్‌ లోని ఓయూ ఆర్ట్స్‌ కళాశాల న్యూ సెమినార్‌ హాల్‌ లో ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ ఎన్‌) జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 'సబ్‌ కాదేశ్‌-హమారాదేశ్‌' జాతీయ క్యాంపెయినింగ్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పదవులు - కాంట్రాక్టుల కోసం బట్టలు వదిలేసినంత తేలికగా నాయకులు పార్టీలు మారడం హాస్యాస్పదమని కోదండరాం అన్నారు. ఏనాటికైనా ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రజల్ని కదిలిస్తుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సూచనల ప్రకారం అభివృద్ధి - అధికారం అన్నివర్గాలకు అందాలని, ఇది సర్వజనుల హక్కని అన్నారు. అమర్త్యసేన్‌ అన్నట్టు విద్య, వైద్యంపై ప్రజలకు హక్కులు కల్పించాలని కోదండ‌రాం సూచించారు. సరళీకరణ అనంతరం వనరులు కొన్నివర్గాలకే చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సంపన్నుల సంపద రెట్టింపవు తుండగా.. పేదవారు మరింత పేదరికంలో మగ్గుతున్నట్టు కోదండ‌రాం తెలిపారు.

రాష్ట్రంలో పాలకపక్షాలు తమ సెంటిమెంట్స్‌ కోసం ప్రజాధనం వృథా చేస్తున్నాయని జస్టిస్‌(రిటైర్డ్‌) చంద్రకుమార్ మండిప‌డ్డారు.'డెమోక్రసీ-డైవర్సిటీ డెవలప్‌మెంట్‌ సోషల్‌ జస్టిస్‌' అంశంపై ఆయన మాట్లాడుతూ.. మనదేశం అనేక మతాల, కులాల సమ్మేళనమని, ఒకరి పండుగల్ని మరొకరు నిర్వహించుకుంటూ ఐక్యతను చాటుతున్న గొప్ప సెక్యులర్‌, డెమోక్రటిక్‌ విలువల గల దేశమని చెప్పారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేన్లనీ, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లని గొప్పగొప్ప హామీలిచ్చిన పాలకులు అమలు చేయకపోవడం బాధాకరమని చంద్ర‌కుమార్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న 12 లిఫ్టుల్లో 10 పనిచేయడం లేదని, వైద్య పరికరాలు మరమ్మతులకు కూడా నోచుకోని దుస్థితి నెలకొందని అన్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లేవని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు ఉద్యమిస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం సీఎం క్యాంపు ఆఫీసుకు రూ.50 కోట్లు, నూతన సచివాలయానికి రూ.350 కోట్లు కేటాయించడం ఎంతవరకు సబబని చంద్ర‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 2700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/