Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎంది ఆంధ్ర స్టైలు పాల‌నేన‌ట‌

By:  Tupaki Desk   |   25 Jun 2017 12:05 PM GMT
తెలంగాణ సీఎంది ఆంధ్ర స్టైలు పాల‌నేన‌ట‌
X
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం సాగించిన ఉద్య‌మంలో జోడెద్దుల్లా న‌డిచిన కేసీఆర్ - కోదండ‌రాంల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుందన్న సంగ‌తి తెలిసిందే. ఉద్య‌మ కాలంలో కేసీఆర్ ను తెలంగాణ కోసమే పుట్టిన‌వాడిగా అభివ‌ర్ణించిన కోదండ‌రాం ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల త‌ర‌హాలోనే తీవ్ర స్థాయి ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ పాల‌న అచ్చంగా ఆంధ్రా పాల‌న‌లా ఉందంటూ ఆయ‌న ఆరోపించారు.

గత ఆంధ్రా పాలకులకు, ప్ర‌స్తుతం తెలంగాణ‌ను ఏలుతున్న కేసీఆర్ కు ఏమాత్రం తేడా క‌నిపించ‌డం లేద‌ని కోదండరాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల స్ఫూర్తియాత్రలో భాగంగా చేప‌ట్టిన బ‌స్సు యాత్రం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నిజాంపేటకు చేరుకున్న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు.

కులవృత్తులను ఆదుకుంటామంటూనే వారికి అన్యాయం చేస్తున్నారని కోదండ‌రాం ఆరోపించారు. గొల్లకురుమ‌లకు సబ్సిడీ ద్వారా గొర్రెలను పంపిణీ విధానంలో లోపాల‌ను ఆయ‌న ఎత్తి చూపారు. రుణమాఫీ అంటూనే బ్యాంకు అధికారులు కొత్త రుణాలు ఇవ్వడంలేదని, పాత రుణాల మాఫీకి పత్రాలు తేవాలని రైతులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి విధానం లేదన్నారు. వలసజీవుల బతుకులకు బతుకుదెరువు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అధికారం చేయాలని సూచించారు. అన్ని సమస్యలను ప్రభుత్వానికి వివరించినా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. నాయకులు నిస్వార్థంగా పనిచేయాలని హితవు పలికారు. దివంగత జయశంకర్ ఆశయాలకు కొనసాగించేందుకు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యామని ఆయ‌న అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/