Begin typing your search above and press return to search.

మాష్టారు చెప్పిన బ్రోక‌ర్ వ్య‌వ‌స్థ‌

By:  Tupaki Desk   |   30 Sep 2017 5:31 AM GMT
మాష్టారు చెప్పిన బ్రోక‌ర్ వ్య‌వ‌స్థ‌
X
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో తీవ్రంగా శ్ర‌మించిన వారిలో కోదండం మాష్టారి పేరు అగ్ర‌భాగాన నిలుస్తుంది. తెలంగాణ ఉద్య‌మం మలిభాగంలో ఎంట్రీ ఇచ్చిన కోదండం మాష్టారు.. ప్ర‌త్యేక‌రాష్ట్ర సాధ‌న కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌య్యాక రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కుండా.. ఎలాంటి ప‌ద‌వులు తీసుకోకుండా క‌ళాశాల‌కు వెళ్లి పాఠాలు చెప్పిన కోదండం మాష్టారు ఇప్పుడు సామాజిక అంశాల మీద పోరాడుతున్నారు.

రాజ‌కీయ పార్టీ పెడ‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నా.. దానిపై క్లారిటీ ఇవ్వ‌ని కోదండం మాష్టారు.. గ‌డిచిన కొంత‌కాలంగా తెలంగాణ అధికార‌ప‌క్షంపై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

అయితే.. త‌న విమ‌ర్శ‌ల్ని ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడే కోదండం మాష్టారు తాజాగా మాత్రం కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మారిన ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఇటీవ‌ల కాలంలో ప్ర‌క‌టిస్తున్న కొత్త విధానాలు ప‌లు సందేహాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి.

అలాంటిదే రైతు స‌మ‌న్వ‌య స‌మితులుగా చెప్పాలి. దీనిపై తాజాగా కోదండ‌రాం చెల‌రేగిపోయారు. రైతు స‌మ‌న్వ‌య స‌మితులు మ‌రో బ్రోక‌ర్ వ్య‌వ‌స్థ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన గ్రామ పంచాయితీల్ని నిర్వీర్య‌పరిచి.. టీఆర్ఎస్ నేత‌ల‌కు ప‌ద‌వులు పంపిణీ చేసేందుకే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు స‌మితులు ఏర్పాటు చేసిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

స‌మితుల ఏర్పాటు.. అందులో నిర్వ‌హించే కార్య‌క‌లాపాల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రెవెన్యూ స‌మ‌స్య‌లు.. పంట సాగుకు రూ.4వేల పెట్టుబ‌డి.. వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఇత‌ర స‌బ్సిడీల‌ను స‌మితుల‌కు అనుసంధానం చేయ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ మ‌రో బ్రోక‌ర్ వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టిన‌ట్లుగా మార‌తాయ‌న్నారు. ధాన్యం కొనుగోలుకు పంచాయితీలు.. గ్రామ‌స‌భ‌.. మ‌హిళా స‌మాఖ్య‌లు.. స‌హ‌కార సంఘాలు ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ స‌మితులు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. రైతు స‌మ‌న్వ‌య క‌మిటీల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసిన కోదండ‌రాం అక్టోబ‌రు 3 నుంచి స‌త్యాగ్ర‌హం చేప‌ట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఫ‌లానా తేదీన‌.. ఫ‌లానా స‌మ‌యంలో.. ఫ‌లానా వేదిక మీద స‌త్యాగ్ర‌హం చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తే సీఎం కేసీఆర్ చేయనిస్తారా? ఈ విష‌యంలో మిగిలిన వారికంటే కోదండ‌రాంకే అనుభ‌వం ఎక్కువ‌. మరి.. ఈసారి మాష్టారి స‌త్యాగ్ర‌హం ఏమవుతుందో చూడాలి.