Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారి ఆక్రోశాన్ని వినే వారున్నారా?

By:  Tupaki Desk   |   10 March 2016 5:13 AM GMT
కోదండం మాష్టారి ఆక్రోశాన్ని వినే వారున్నారా?
X
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉద్యమ నేతల్లో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయనేతల్ని ఒక చోటకు తీసుకొచ్చి.. అందరికి కలుపుకొని ఉద్యమాన్ని పీక్ స్టేజ్ లోకి తీసుకొచ్చిన కోదండరాం.. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని తీరేలా చేయటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి కదం తొక్కటాన్ని మర్చిపోలేం.

సినిమాల్లో మాదిరి.. తాను అనుకున్నది సాధించిన తర్వాత రాజకీయ లబ్థి చూసుకోకుండా.. తన మానాన తాను ఉండిపోయే నిర్ణయాన్ని తీసుకొని.. అదే బాటలో నడుస్తున్న కోదండరాం మాటకు తెలంగాణలో ఉండే విలువ అంతాఇంతా కాదు. అలాంటి ఆయన.. గత కొద్దిరోజులుగా కామ్ గా ఉంటున్నారు. జరుగుతన్న పరిణామాల్ని చూస్తున్నా ఆయన పెద్దగా గొంతు విప్పటం లేదు. అలాంటి ఆయన తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలన్న విమర్శతో పాటు.. ప్రభుత్వ పథకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలనటం గమనార్హం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలంగాణ జేఏసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లంతా ఎమ్మెల్యేలు.. మంత్రులు అయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారు మాత్రం గుర్తింపునకు నోచుకోవటం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు.

దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసినప్పుడు.. దాని కొనసాగింపుగా.. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారు రాజకీయ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా.. తన మానాన తాను ఉన్నప్పుడు.. రాజకీయం బలపడినప్పుడు ఉద్యమకారులకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే తెలంగాణ ఉద్యమ నేతలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పని కోదండం మాష్టారు లాంటి వారు ఇప్పుడు ఆక్రోశం వ్యక్తం చేస్తే ప్రయోజనం ఉంటుందా..?