Begin typing your search above and press return to search.

జనగామ కోదండం సార్‌ దే

By:  Tupaki Desk   |   16 Nov 2018 7:35 AM GMT
జనగామ కోదండం సార్‌ దే
X
మ‌హా కూట‌మి సీట్ల పంప‌కాల్లో రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించిన జ‌న‌గామ స్థానం కోదండరాం సార్‌ దేన‌ని తేలిపోయింది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలంగాణ జ‌న స‌మితి ద‌క్కించుకుంది. సాక్షాత్తూ ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీయే ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త నిచ్చారు. దీంతో ఈ నెల 19న నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు కోదండ‌రాం సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు - జ‌న‌గామ సీటుపై ఎన్నెన్నో ఆశ‌లు పెట్టుకున్న టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మయ్య తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు.

తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే త‌మ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు మూడు జాబితాల్లో కాంగ్రెస్ విడుద‌ల చేసింది. ఈ మూడింటిలోనూ పొన్నాల‌కు చోటు ల‌భించ‌లేదు. దీంతో కంగారుప‌డ్డ ఆయ‌న‌.. హ‌స్తిన వెళ్లి నేరుగా రాహుల్‌ ను క‌లిశారు. అయితే - తెలంగాణ జ‌న స‌మితికి ఆ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా కేటాయించామంటూ రాహుల్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఏదైనా ఉంటే కోదండ‌రాంతోనే మాట్లాడుకోవాల‌ని సూచించారు. దీంతో పొన్నాల‌తోపాటు హ‌స్తిన వెళ్లిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి కోదండం సార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే జ‌న‌గామ‌ను వ‌దులుకునేందుకు కోదండ‌రాం సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌లేదు. దీంతో ఆ స్థానంలో తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు పోటీ చేయ‌డం ఖాయ‌మైంది.

జ‌న‌గామ‌లో పోటీకి వీలుగా కోదండ‌రాం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ప్ర‌చార ర‌థాల‌ను కూడా సిద్ధం చేశారు. వాటిపై జనగామ అభ్యర్థి కోదండరాం అని స్ప‌ష్టంగా రాసి ఉంది. ఇక జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం జ‌న‌గామ‌లోనే నివాస‌ముండేందుకు వీలుగా అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాయి. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి ప‌లువురు జ‌డ్పీటీసీలు - ఎంపీటీసీలు - మాజీ సర్పంచ్‌ లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలుస్తున్నారు. వారి మ‌ద్ద‌తును కూడ‌గ‌డుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ ఇద్దరు బలమైన నేతలు కూడా కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి పొన్నాల కూడా రాహుల్ గాంధీ మాట‌కు క‌ట్టుబ‌డి కోదండ‌రాంతో క‌లిసి ప‌నిచేస్తారా? లేక స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీకి సై అంటారా? అనేది వేచి చూడాల్సిందే!