Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో పార్టీ విలీనం దిశగా కోదండరాం?

By:  Tupaki Desk   |   8 July 2021 2:30 AM GMT
కాంగ్రెస్ లో పార్టీ విలీనం దిశగా కోదండరాం?
X
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వెల్లివిరిస్తోంది. పగ్గాలు చేపట్టకముందే రాజకీయం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి తనకు సహకరించాలని దిగ్గజ మీడియా సంస్థల అధినేతలు, మేధావులు, పలు రాజకీయ ప్రముఖులను వ్యక్తిగతంగా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయిన ఒకప్పటి ఉద్యమ సేనాని కోదండరాం కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయవర్గాలలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల ప్రకారం.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, మాజీ వీసీ, తెలంగాణ ఉద్యమ సేనాని అయిన కోదండరాం తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలో 2009లో మొదలైన ఉద్యమాన్ని నడిపించారు కోదండరాం. కేసీఆర్ కు తోడుగా జేఏసీ అధ్యక్షుడిగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుడి నడిపించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యే వరకు కోదండరాం ఒక శక్తిగా ఉన్నారు. కానీ తరువాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో విడిపోయారు. 2018 ఎన్నికలకు ముందు తన సొంత రాజకీయ పార్టీ ని ‘టీజేఎస్’ స్థాపించారు.

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేశారు.అయితే టీజేఎస్ ఆ ఎన్నికల్లో ఎటువంటి ముద్ర వేయలేకపోయింది. స్వయంగా కోదండరాం కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు.

దీంతో టీజేఎస్ పార్టీలోని నాయకులందరూ పార్టీని ఒకరు తర్వాత ఒకరు విడిచిపెట్టారు. దీంతో టీజేఎస్ పార్టీనే కనుమరుగైన పరిస్థితి. కోదండరాం కూడా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ అండతో ఉధృతంగా నడిపించిన కోదండరాం.. తన సొంత పార్టీని మాత్రం సమర్థవంతంగా నడపడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఇటీవల జరిగిన వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరాం ఓడిపోవడం గమనార్హం.

తెలంగాణ ప్రజల్లో కోదండరాం పట్ల సానుభూతి గౌరవం ఉన్నప్పటికీ ఆయనకు ఆర్థిక బలం, రాజకీయ పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు అంతగా లేవని తేలింది. కాబట్టే ఇక పార్టీని నడిపించడంలో అర్థం లేదని కోదండరాం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ ను విలీనం చేయాలని గత కొన్ని నెలలుగా కోదండరాం ను రేవంత్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు కూడా సాగాయని చెబుతున్నారు.దీనికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే పరిశీలిస్తానని కోదండరాం అన్నట్టు సమాచారం.

వాస్తవానికి టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నించారు. రేవంత్ తరుఫున కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల నివాసానికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ లో చేరాలని ప్రతిపాదించారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. టీజేఎస్ కాంగ్రెస్ తో విలీనం కోసం కోదండరాంతో చర్చలు పునరుద్ధరించబడుతాయి. కోదండరాం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఖచ్చితంగా రేవంత్ కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత ఈ విలీనం ప్రతిపాదన పట్టాలెక్కనుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి కోదండరాం ముందడుగు వేస్తారా? లేదా అన్నది వేచిచూడాలి.