Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మొత్తాన్ని ధ‌ర్నా చౌక్ చేసేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   12 May 2017 9:21 AM GMT
హైద‌రాబాద్ మొత్తాన్ని ధ‌ర్నా చౌక్ చేసేస్తార‌ట‌
X
ఓప‌క్క తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌ధానిలో వైద్య చికిత్స తీసుకుంటున్న వేళ‌.. ఊహించ‌ని రీతిలో రాజ‌కీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ధ‌ర్నా చౌక్ త‌ర‌లింపున‌కు వ్య‌తిరేకంగా వివిధ రాజ‌కీయ ప‌క్షాలు గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌ర్నా చౌక్ ను న‌గ‌ర శివారుకు త‌ర‌లించాల‌న్న విష‌యంపై తెలంగాణ అధికార‌ప‌క్షం ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ధ‌ర్నా చౌక్ ప్రాంతంలో నివ‌సించే వారి కోరిక మీద‌టే తాము త‌ర‌లించాల‌ని అనుకుంటున్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. ఈ వ్య‌వ‌హారంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల‌ని చేస్తున్న‌ది ఏమీ లేద‌ని.. కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయ‌ని చెప్ప‌టం తెలిసిందే.

అయితే.. ధ‌ర్నా చౌక్‌ ను న‌గ‌ర‌శివారుకు మార్చ‌టం వెనుక కేసీఆర్ స‌ర్కారు పెద్ద వ్యూహం ఉంద‌న్న అభిప్రాయాన్ని రాజ‌కీయ ప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి. రాజ‌కీయ పార్టీల వాణి పెద్ద‌గా వినిపించ‌కుండా ఉండేందుకు వీలుగా ధ‌ర్నా చౌక్ మార్చాల‌ని భావిస్తున్నార‌ని.. దీన్ని త‌ప్ప‌నిస‌రిగా అడ్డుకొని తీరుతామ‌ని విప‌క్షాలు చెబుతున్నాయి.

ఇందుకోసం.. ఈ నెల 15న ఛ‌లో ధ‌ర్నా చౌక్ పేరిట భారీ ఆందోళ‌న‌ల‌కు ప్లాన్ చేశారు. దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా ప్ర‌త్య‌క్షంగా పాల్గొనాల‌ని వామ‌ప‌క్ష నేత‌లు కోరారు. అయితే..ధ‌ర్నా చౌక్ త‌ర‌లింపున‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. తాను ప్ర‌త్య‌క్షంగా పాల్గొనలేన‌ని చెప్పేశారు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఈ ఆందోళ‌న‌పై గ‌ళం విప్పారు తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం. ప్ర‌త్యేక తెలంగాణ‌లో ధ‌ర్నాలు చేసే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఈ నెల 15 లోపుల ధ‌ర్నా చౌక్ త‌ర‌లింపుపై ప్ర‌భుత్వం కానీ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోకుంటే.. హైద‌రాబాద్ న‌గ‌రం మొత్తాన్ని ధ‌ర్నా చౌక్ చేసేస్తామ‌న్నారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు.. నిర‌స‌న హ‌క్కును నిల‌బెట్టుకోవ‌టం కోస‌మే తాము ఆందోళ‌న‌ను చేప‌డుతున్నామ‌న్న కోదండ‌రాం.. ఖ‌మ్మంలో రైతుల‌కు బేడీలు వేసిన వైనం.. తెలంగాణ యావ‌త్ రైతులకు సంకెళ్లు వేసిన‌ట్లుగా అభివ‌ర్ణించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/