Begin typing your search above and press return to search.

ఆమెను బయటకు రప్పించి.. కన్నీళ్లు పెట్టించారే..

By:  Tupaki Desk   |   24 Feb 2017 3:34 AM GMT
ఆమెను బయటకు రప్పించి.. కన్నీళ్లు పెట్టించారే..
X
చూసేందుకు చాలా చిన్న సంఘటనలుగా కనిపిస్తుంటాయి. వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చర్మం దళసరిగా ఉండే రాజకీయ వర్గాలు కొన్ని సున్నితమైన అంశాల్ని పెద్దగా పట్టించుకోరు. లైట్ తీసుకుంటారు. కానీ.. అలాంటి సంఘటనలే పదే పదే చోటు చేసుకొని.. చివరకు పుట్టె మునిగేలా చేస్తాయి. తాజాగా తెంగాణ రాష్ట్ర సర్కారు తీరు ఇదే తీరులో ఉందని చెప్పొచ్చు. నిరుద్యోగుల నిరసన ర్యాలీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు చాలానే తప్పులు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై పాజిటివ్ మాట బలంగా వినిపిస్తోంది. ఏపీలో విపక్షంతో పోలిస్తే.. తెలంగాణలో విపక్షం బలహీనంగా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనకంతా సానుకూలంగా ఉన్న వేళ.. కోదండం మాష్టారి విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు.

ఉద్యమనేతగా ఎన్నో ఉద్యమాలు.. నిరసనలు.. ఆందోళనలకు పిలుపునిచ్చిన కేసీఆర్ లాంటి నేత.. పవర్లో ఉన్న వేళ.. తనకు వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు నిర్వహించకూడదని అనుకోవటం ఏ మాత్రం సరి కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. అధికారం చేతిలో ఉన్నవేళ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తమను ఇబ్బందికి గురి చేస్తాయన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో మర్చిపోయారన్న మాట వినిపిస్తోంది.

అధికారం శాశ్వితం ఎంతమాత్రం కాదు. ఏదో రోజున ఎవరో ఒకరు కొత్తవాళ్లకు పవర్ ను అప్పగించాల్సిందే. అలాంటి రోజు.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల్నే తమపైనా ప్రయోగిస్తారన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం. అలాంటి రోజున తమ వాదనకు విలువ ఉండదని.. తాము పవర్ లో ఉన్నప్పుడు చేసిందే అప్పుడు పవర్ లో ఉన్న వారు చేసే వీలు ఉంటుంది. అందుకే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. భవిష్యత్తును పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోదండం మాష్టారి అరెస్ట్ విషయంలో దూకుడును ప్రదర్శించారన్న మాట బలంగా వినిపిస్తోంది.

జరగకూడని తప్పులన్నీ కలగలపి కోదండం మాష్టారి అరెస్ట్ ఎపిసోడ్ లో జరిగిపోయినట్లుగా చెబుతున్నారు. అరెస్ట్ చేయటమే తప్పన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. అంతేకాదు.. అరెస్ట్ చేసిన విధానాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అర్థరాత్రి వేళ.. తలుపులు బద్ధలు కొట్టి మరీ.. అరెస్ట్ చేయటం ఏమిటని నిలదీస్తున్నారు. కోదండం మాష్టారు ఇంట్లో నుంచి బయటకు రాకూడదంటే.. హౌస్ అరెస్ట్ చేస్తే గౌరవంగా ఉండేదని.. కానీ.. అర్థరాత్రి వేళ ఇంట్లోకి జొరపబడి అరెస్ట్ చేయటం.. ఎక్కడు ఉంచారన్న విషయంపై సరైన సమాచారం ఇవ్వకపోవటం.. చివరకు తన భర్త ఆచూకీ చెప్పాలంటూ కోదండం మాష్టారి సతీమణి సుశీల బయటకు రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన పెద్ద.. పెద్ద ఉద్యమాల సమయంలోనే కోదండం మాష్టారి సతీమణి సుశీల బయటకు రాలేదని.. అలాంటిది సొంత రాష్ట్రంలో.. సొంతోళ్లు పవర్ లో ఉన్న వేళ.. భర్త ఆచూకీ కోసం బయటకు రావటం.. గోడు చెప్పుకోవటానికి గవర్నర్ ఇంటికి వెళితే.. కలిసేందుకు అనుమతి రాకపోవటం.. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె కంట కారిన కన్నీరు పలువురు గుండెల్ని తాకాయని.. అయ్యో ఎంత కష్టం వచ్చిందే.. ఎంత దారుణం జరిగిందేనన్న భావనకు తెలంగాణ ప్రజలు గురైనట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వాటి ఎఫెక్ట్ ఇప్పటికిప్పుడే అధికారపక్షానికి తెలియకున్నా.. రానున్న రోజుల్లో తెలీయటం ఖాయమని.. అప్పుడెంత అయ్యో అనుకున్నా లాభం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా.. సున్నిత అంశాల విషయాల్లో కేసీఆర్ మరింత దృష్టి సారించాలన్న మాట వినిపిస్తోంది. లేకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/