Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు.. రెండు రాష్ట్రాల సీఎంలకు పెను సవాల్‌

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:05 AM GMT
ఆ ఇద్దరు.. రెండు రాష్ట్రాల సీఎంలకు పెను సవాల్‌
X
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఆశ్చర్యకర పరిణామాలు తలెత్తాయి. రెండేళ్ల పాలన పూర్తిచేసుకుని ప్రజలకు తమ ఘనకార్యాలు చెప్పుకొంటున్న తరుణంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇద్దరు వ్యక్తులు ఇరకాటంలో పడేశారు. సీఎంలిద్దరికీ ఇది సవాల్ గా మారిపోయింది. వారిని ఏమీ అనకుండా వదిలేసినా గొడవే.. ఏమైనా అన్నా గొడవే అన్నట్లుగా ఉండడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల పరిస్థితి ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను హడలెత్తిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని అధికారపార్టీ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న నాయకుడు - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే, మరొకరు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమిస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీ సర్కార్‌ కు ముద్రగడ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, తెలంగాణలో గత నాలుగైదు రోజుల వరకు ఏమి పట్టనట్లు వ్యవ హరించిన కోదండరామ్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరు చుకుపడుతూ కేసీఆర్ కంట్లో నలుసు మాదిరిగా తయారయ్యారు. ఇద్దరికీ ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉంది.. ఊ అంటే ఉరికొచ్చే జనం వెనుక ఉన్నారు. ఆ కారణంగా ఏపీ - తెలంగాణ సీఎంలు చంద్రబాబు - కేసీఆర్ లు వారిని చూసి జడుసుకుంటున్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ తో కలిసి భుజం - భుజం కలిపి ఉద్యమించిన కోదండరామ్ - రెండేళ్ల ప్రభుత్వ పాలనపై తొలిసారిగా గత నాలుగురోజుల క్రితం జరిగిన ఒక సదస్సులో గళం విప్పారు. ప్రజా ఆకాంక్షల అనుగుణంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం పని చేయడం లేదని నిప్పులు చెరిగారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం సాధించిందేమి లేదని తేల్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రులు - టీఆర్ ఎస్ ముఖ్యనేతలంతా కోదండరామ్‌ పై ముప్పేటదాడి దిగారు. మంత్రుల విమర్శలతో కోదండరామ్ ఏమాత్రం వెరవలేదు... సరికదా ప్రభుత్వంపై తన విమర్శల పదును పెంచారు. తెలంగాణలో విపక్షమన్నది లేదని మురిసిపోతున్న తరుణంలో కోదండరామ్ ప్రభుత్వ విధానాల్ని విమర్శించడమేమిటని కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరోవైపు కోదండరాంకు కూడా అన్ని వైపుల నుంచి మద్దతు వస్తుండడంతో టీఆరెస్ తొలిసారి ఆందోళనకు గురవుతోంది.

ఇక ఏపీ విషయానికొస్తే కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొన్నాళ్లుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా మరోసారి ధర్నాలు - దీక్షలతో ఆయన చంద్రబాబుకు టెన్షన్ తెప్పిస్తున్నారు. గత రెండు రోజులుగా తుని ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్టు చేస్తుండడంతో వారిని విడిచిపెట్టాలంటూ ముద్రగడ మరోసారి తన ఇంట్లోనే దీక్షకు దిగారు. దీంతో ఏపీలోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలా.. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ఊహించని విధంగా ముఖ్యమంత్రులకు సవాల్ గా మారడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్షాలు చేయలేని పనిని ఇద్దరు వ్యక్తులు చేయడం రాజకీయ పార్టీలను ఆలోచనల్లో పడేస్తోంది