Begin typing your search above and press return to search.

హాస్యాస్పదంగా ఏపీ అసెంబ్లీ!

By:  Tupaki Desk   |   16 March 2015 11:45 AM GMT
హాస్యాస్పదంగా ఏపీ అసెంబ్లీ!
X
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఎంత హాస్యాస్పదంగా సాగుతున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతోపాటు అధికార పార్టీ మంత్రులు, నాయకులు కూడా సభా సమావేశాలను హాస్యాస్పదంగా మార్చేశారని కూడా చెప్పవచ్చు. వీరంతా కలిసి అరగంటపాటు చర్చకు బదులుగా మూడు గంటల గందరగోళానికి కారణమవుతున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై చర్చకు అధికార పక్షం నోటీసు ఇచ్చింది. దానిపై చర్చకు స్పీకర్‌ అంగీకరించారు. రాయలసీమకు మంచినీటిని అందించే ఈ పథకంపై చర్చకు తామే శ్రీకారం చుట్టామని, దాంతో వైసీపీ ఇరుకున పడిపోయిందని, దీనిని అడ్డుకుంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదని ప్రచారం చేయవచ్చని భావించింది. అసలు ఈ అంశంపై మాట్లాడడానికి జగన్‌ వద్ద సబ్జక్టు కూడా లేదని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు కూడా.

పట్టిసీమ ఎత్తిపోతల చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై మాట్లాడడానికి తనకు అరగంట సమయం కావాలని వైసీపీ అధినేత జగన్‌ పట్టుబట్టాడు. అయితే, జగన్‌కు అరగంటపాటు సమయం ఇచ్చేది లేదంటూ స్పీకర్‌ కోడెల, మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు తదితరులంతా కలిసి దాదాపు మూడు గంటల సమయాన్ని వృథా చేశారు. అసలు సబ్జక్టు లేని జగన్‌ ఆ అంశంపై అరగంటపాటు ఏం మాట్లాడతాడు? ఒకవేళ మాట్లాడితే ఆయన పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడాలి. వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన రాయలసీమకు వ్యతిరేకం అవుతాడు. అటువంటప్పుడు జగన్‌తో ఎంతసేపు మాట్లాడిస్తే అధికార పక్షానికి అంత మైలేజీ వస్తుంది కదా! కానీ, జగన్‌కు అరగంటపాటు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ, గంటలరతబడి సమయాన్ని మాత్రం వృథా చేశారు. దీనినిబట్టే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో అంచనా వేయవచ్చు.