Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ గౌర‌వానికి కోడెల కొత్త భాష్యం చెప్పారే!

By:  Tupaki Desk   |   5 March 2019 3:04 PM GMT
స్పీక‌ర్ గౌర‌వానికి కోడెల కొత్త భాష్యం చెప్పారే!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప‌ల్నాడుకు చెందిన కోడెల శివ‌ప్ర‌సాద్‌.. స్పీక‌ర్ స్థానంలో ఉన్న నేత వ్య‌వ‌హ‌రించాల్సిన హూందాత‌నంపై త‌న‌దైన కొత్త భాష్యం చెప్పారు. ప్ర‌స్తుతం తానే ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కోడెల‌... ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సొంత పార్టీ కార్య‌క్ర‌మాల్లో మునిగి తేలుతూ... సీఎం చంద్ర‌బాబుకు పాలాభిషేకాలు చేస్తూ... విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై త‌న‌దైన శైలి విషం పొలిటిక‌ల్ విమ‌ర్శ‌లు చేస్తూ... నిత్యం వివాదాల్లోనూ ఉంటున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. అయినా స్పీక‌ర్‌ గా ఎన్నికైన త‌ర్వాత రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం లేకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని మ‌న భార‌త రాజ్యాంగం చెబుతోంది. ఇప్ప‌టిదాకా స్పీక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించిన చాలా మంది నేత‌లు ఆ స్థానానికి గౌర‌వాన్ని పెంచార‌నే చెప్పాలి.

ఇత‌ర పార్టీల నేత‌ల వ‌ర‌కూ ఎందుకు?... టీడీపీకే చెందిన దివంగ‌త నేత‌, లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి... ఆ స్థానానికి స‌రికొత్త వ‌న్నె తెచ్చార‌నే చెప్పాలి. మ‌రి ఇప్పుడు కోడెల ఆ త‌ర‌హాలో ముందుకు సాగ‌డం లేదా? ... ముమ్మాటికీ లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... స్పీక‌ర్ స్థానంలో ఉన్న నేత‌... త‌న‌ను అసెంబ్లీకి పంపిన పార్టీకి అనుకూలంగా, విప‌క్ష పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌రాదు. అయితే ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ గా ఉన్న కోడెల చేస్తున్న‌దేమిటి? . ఓ పార్టీ సాధార‌ణ కార్య‌క‌ర్త‌కు మించి పొలిటిక‌ల్ కార్య‌క్ర‌మాల్లో త‌న‌దైన శైలిలో పాలుపంచుకుంటూ ఉన్నారు. ఈ త‌ర‌హా కోడెల వైఖరిని నిర‌సిస్తూ... ఇటీవ‌లే సేవ్ స‌త్తెన‌ప‌ల్లి పేరిట విప‌క్షాల‌న్నీ క‌లిసి స‌త్తెన‌ప‌ల్లిలో ఓ భారీ నిర‌స‌న‌ను నిర్వ‌హించాయి. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... స్పీక‌ర్ ప‌ద‌వికి గౌర‌వం ఉంటుందంటూనే... ఆ ప‌దవికి గౌర‌వం ఇవ్వాల్సిందేన‌ని చెబుతూనే... తాను మాత్రం రాజ‌కీయాలు మానుకునేందుకు మాత్రం స‌సేమిరా అంటూ కోడెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో చిచ్చుకు కార‌ణ‌మైన డేటా చోరీపై స్పందించేందుకు నేటి ఉద‌యం కోడెల మీడియా ముందుకు వ‌చ్చారు. మీడియా స‌మావేశం ప్రారంభానికి ముందే... మీడియా ప్ర‌తినిధులు కోడెల‌కు త‌మ‌దైన ప్ర‌శ్న‌లు సంధించారు. స్పీక‌ర్ గా ఉండి ఇలాంటి విష‌యాల‌పై స్పందించ‌డం భావ్య‌మేనా? అని మీడియా ప్ర‌తినిధులు అన‌గానే... త‌న‌దైన శైలి రూలింగ్ ఇచ్చేసిన కోడెల‌.. స్పీక‌ర్ ప‌ద‌వికి ఉన్న గౌర‌వానికి కొత్త భాష్యం చెప్పేశారు. *స్పీక‌ర్ ప‌ద‌వికి ఉండే గౌర‌వం ఎలాగూ ఉంటుంది. అయితే నేను ఇక్క‌డితోనే రాజ‌కీయాలు మ‌నుకోవ‌డం లేదు క‌దా. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పోటీ చేస్తాను కదా. మ‌రి టీడీపీ నేత‌గా నేను రాజ‌కీయాలు మాట్లాడ‌కుండా ఎలా ఉంటాను? స్పీక‌ర్ ప‌దవికి ఉండే గౌర‌వం ఉంటుంది. అయితే నా రాజ‌కీయం నాకు ఉంటుంది క‌దా* అంటూ కోడెల త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత గ‌తంలో మాదిరే చంద్ర‌బాబును ఆకాశానికెత్తేస్తూ... జ‌గ‌న్ ను దునుమాడుతూ కోడెల త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.