Begin typing your search above and press return to search.

ఆయన్ను పల్నాటి పులి అంటారట

By:  Tupaki Desk   |   20 Jun 2016 4:33 AM GMT
ఆయన్ను పల్నాటి పులి అంటారట
X
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి చాలానే ఆసక్తికర విషయాలు వచ్చాయి. అదే సమయంలో కొన్ని సంచలన విషయాలు కూడా చెప్పారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన వెల్లడించిన విషయాలు కోడెలకు తలనొప్పులు తెస్తాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఎన్నికల్లో పెరిగిన ఖర్చు గురించి ప్రస్తావించిన ఆయన.. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగినట్లుగా పేర్కొన్నారు.

1983లో అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చినప్పుడు.. ఎన్నికల్లో తాను ఖర్చుచేసింది రూ.30వేలు మాత్రమేనని.. మొన్న ఎన్నికల్లో రూ.11కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆయన చెప్పినట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. ఎన్నికల నిబంధనల పరిమితికి మించిన మొత్తంగా దీన్ని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశం వివాదం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. తనను తమ ప్రాంత ప్రజలు పల్నాటి సింహంగా పేర్కొంటారని చెప్పిన ఆయన మరికొన్ని ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. అవేమంటే..

= నేను ఫ్యాక్షనిస్ట్ ను కాను. దాని బాధితుడ్ని. నాపై నాలుగుసార్లు బాంబుదాడులు జరిగాయి. ఫ్యాక్షనిస్ట్ అని అనిపించుకుంటే మీ దగ్గరకు ఎవరూ రారంటూ ఓ పెద్దాయన సలహా ఇచ్చారు.

= రాజకీయాల్లోకి రావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునివ్వటమే కాదు.. కోరి మరీ టికెట్ ఇచ్చారు. దాన్ని ఎప్పటికి మర్చిపోలేను.

= గత రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు అస్సలు పోలికే లేదు. గతానికి భిన్నంగా ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఆ తరహా రాజకీయాలే కనిపిస్తున్నాయి.

= ఈసారి మంత్రి పదవి వస్తుందనుకున్నా. కానీ.. స్పీకర్ పదవి వచ్చింది. ఈ పదవికి ఫిట్ కానన్న భావన ఉండేది.

= ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మైకు తీసుకొని మాట్లాడాలంటే బెరుగ్గా ఉండేది. స్టేజ్ మీదకు మాట్లాడటానికి వెళితే ఇబ్బందిగా ఉండేది.

= మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును అడిగా. ఒకవేళ కుదరకపోతే పదవి ఇవ్వకపోయినా ఫర్లేదన్నా. ఆయనేమో స్పీకర్ పదవి ఇస్తానన్నారు. సరేనన్నా.

= భావోద్వేగాల్నిచంపేశా. స్పీకర్ గా వందశాతం పని చేయాలన్న ఆలోచనతోనే పని చేస్తున్నా. అధికారపక్ష ఏజెంటుగా వ్యవహరించటం లేదు.

= ప్రతి స్పీకర్ మీదా ఆరోపణలు.. విమర్శలు మామూలే. ప్రతిపక్షాలకే ఎక్కువ అవకాశం ఇస్తున్నా. స్పీకర్ పదవిలో అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.

= సబా గౌరవం కోసమే రోజాను సస్పెండ్ చేశాం. ఆమె భాష.. హావభావాలు బాగుండవు. కోర్టు కూడా రోజాను తప్పు పట్టింది.

= క్షమాపణలు చెప్పాలని కోర్టు చెప్పినా ఆమె వినలేదు. ఆమె నుంచి క్షమాపణలు కోరుతూ ఎలాంటి లేఖ రాలేదు.

= తప్పు దిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారు.

= పార్టీ ఫిరాయించటం వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. జరుగుతున్న విషయాల్ని గమనిస్తున్నా. స్పీకర్ గా ఏం చేయాలో అదే చేస్తా.

= పార్టీను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు సరిగా లేవు.

= ప్రజలు ప్రేమతో పల్నాటి పులి అని పిలుచుకుంటారు. అదంతా వారికి నా మీదున్న అభిమానమే.