Begin typing your search above and press return to search.

కోడెల గారూ... జంపింగ్‌లు మీ లెక్క‌లో లేవా?

By:  Tupaki Desk   |   1 April 2017 6:21 AM GMT
కోడెల గారూ... జంపింగ్‌లు మీ లెక్క‌లో లేవా?
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి కోడెల శివ‌ప్ర‌సాద్‌... గ‌తంలో ఎలా ఉన్నా ప్ర‌స్తుతం మాత్రం రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఏపీ అసెంబ్లీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ ప‌ద‌విలో ఉన్నారు. స్పీక‌ర్ ప‌ద‌వి చేపట్ట‌డానికి ముందు... గుంటూరు జిల్లాకు చెందిన కోడెలకు దూకుడుగా వెళ్లే నేతే అన్న పేరు ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేనా... ఒకానొక సంద‌ర్బంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న త‌రుణంలో ఆయ‌న ఇంటిలో నాటు బాంబులు దొరికిపోయాయి. నాడు ఈ ఘ‌ట‌న పెను సంచ‌ల‌నంగానే మారింది. పార్టీ నేత‌ల‌పైనే కాకుండా త‌న‌కు ఎదురుగా వ‌చ్చే ఎవ‌రిపైనా అయినా ఎదురు దాడికి దిగేందుకు ఏమాత్రం సంకోచించ‌ని కోడెల... ప్ర‌స్తుతం కాస్తంత కోపం త‌గ్గించుకున్న‌ట్లే ఉంది.

ఎందుకంటే... గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మంత్రి ప‌ద‌వికి బ‌దులుగా స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చేసి కూర్చోబెట్టారు. స్పీక‌ర్ స్థానానికి అస‌లు కోడెల సూట్ కారంటూ విప‌క్షం వైసీపీ గొంతెత్తున్న వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా... ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర తీసిన టీడీపీ... ఏకంగా వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో 21 మందిని త‌న పార్టీలో చేర్చుకుంది. విడ‌త‌ల‌వారీగా జ‌రిగిన చేరిక‌ల్లో స్వ‌యంగా చంద్ర‌బాబే వారినికి ప‌చ్చ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా పార్టీ మారిన వారంతా కూడా వైసీపీ టికెట్‌పై గెలిచినా... ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు.

ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు ప్ర‌స్తావించిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... త‌మ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించి పార్టీ మారిన వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని స్పీక‌ర్ స్థానంలోని కోడెల‌ను కోరారు. ఈ మేర‌కు ప‌లుమార్లు లేఖ‌లు కూడా రాశారు. దీనిపై అంత‌గా స్పందించని స్పీక‌ర్‌... త‌న నిర్ణ‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే నిన్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల ముగింపు రోజున‌... ఓ వింత చోటుచేసుకుంది. ఈ వింత ఏ స్థాయిలో ఉందంటే... స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల పబ్లిక్‌ గానే అబ‌ద్ధం చెప్పేసిన‌ట్టుంది.

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు సీట్లు టీడీపీ కోటాలోనే కేటాయించ‌బ‌డ్డాయి. స‌మావేశాల్లో భాగంగా వారంతా టీడీపీ స‌భ్యుల ప‌క్కనే కూర్చుంటున్నారు. అయినా త‌న‌ను తాను కాపాడుకునేందుకు నిన్న కోడెల ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీలోని బ‌లాబ‌లాల‌ను ప్ర‌స్తావించిన కోడెల‌... టీడీపీ స‌భ్యులు 102 మంది ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న వైసీపీ బ‌లాన్ని 66గా ప్ర‌క‌టించారు. ఓ వైపున వైసీపీ బ‌లం బాగా త‌గ్గిపోయింద‌ని సొంత పార్టీ నేత‌లు చెబుతూ ఉంటే... స్పీక‌ర్ స్థానంలో ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల మాత్రం వైసీపీ బ‌లం ఏమాత్రం కూడా త‌గ్గ‌లేద‌న్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వాన్ని ప్ర‌క‌టిస్తే... ఎక్క‌డ బుక్క‌వుతానోన‌న్న భ‌యంతోనే కోడెల ఈ ప్ర‌క‌ట‌న చేశార‌న్నది విశ్లేష‌కుల అభిప్రాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/