Begin typing your search above and press return to search.

ప్రభుత్వ లాంఛనాల్ని రిజెక్ట్ చేసిన కోడెల ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:52 AM GMT
ప్రభుత్వ లాంఛనాల్ని రిజెక్ట్ చేసిన కోడెల ఫ్యామిలీ
X
ఏపీ మాజీ స్పీకర్.. సీనియర్ టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం ఎంతటి రగడకు తెర తీసిందో తెలిసిందే. ఆయన మరణంపై వెల్లువెత్తిన అనుమానాలు ఆయనది ఆత్మహత్యేనన్న వైద్యుల మాటను మరుగన పడేలా చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అధికారికంగా బయటకు రానప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం బలమైన తాడుతో (ప్లాస్టిక్ వైర్) ఆయన ఉరి వేసుకున్న కారణంగానే ప్రాణాలు పోయి ఉంటాయన్న దానిపై పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చినా.. ఏదో అనుమానాన్ని ప్రజల్లో కలిగేలా జరిగిన ప్రచారం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోడెల మరణం తర్వాత కూడా ఆయనపై విమర్శలు వెల్లువెత్తటం చూస్తే.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఒక నేత ఆత్మహత్య చేసుకోవటం.. ఆ తర్వాత కూడా ఆయనపై సానుభూతి పెద్దగా వ్యక్తం కాని రీతిలో పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయన అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

అయితే.. కోడెల కుటుంబం మాత్రం ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదని చెప్పేసింది. తమ నేతలతోనూ.. కార్యకర్తలతోనే అంత్యక్రియల్ని జరుపుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకుకారణం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన వేధింపులేనని ఆరోపిస్తూ.. కంటితుడుపు చర్యగా ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదంటూ కుటుంబ సభ్యులు అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం (బుధవారం) ఒంటి గంట తర్వాత నరసరావుపేట స్వర్గపురి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చెబుతున్నారు.