Begin typing your search above and press return to search.

స‌రికొత్త వివాదంలో ఏపీ స్పీక‌ర్!

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:18 AM GMT
స‌రికొత్త వివాదంలో ఏపీ స్పీక‌ర్!
X
బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని, వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామ‌ని ప‌దే ప‌దే డ‌ప్పుకొట్టుకుంటున్న చంద్ర‌బాబు జ‌మానాలో ఇప్ప‌టికే మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఇటీవ‌ల ఎస్సీ - ఎస్టీల‌పై తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి అడ్డంగా బుక్క‌య్యారు. ఎస్సీలకు స్నానం చేయ‌డం రాద‌ని, గ‌బ్బు కొడుతుంద‌ని, అందుకే చ‌దువు రాద‌ని ఇలా వారిపై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. దీంతో ద‌ళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశాయి. ఇక‌, తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ రావే స్వ‌యంగా ద‌ళితులకు వ్య‌తిరేకంగా కేంద్రానికి లేఖ రాశార‌నే వివాదం చుట్టుముట్టింది. ద‌ళితుల కోసం కేటాయించిన క‌ళాశాల సీట్ల విష‌యంలో ఆయ‌న పెను వివాదానికి తెర‌తీశారు. దీంతో ద‌ళితులు ఇప్పుడు ఉద్య‌మాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఈ ఏడాది ఎస్సీ - ఎస్టీ సీట్లు మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిన సీట్ల‌ను ఇతరులకు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవ‌ల లేఖ రాశారు. వాస్త‌వానికి ఇటు ఉద్యోగాల్లో కానీ - అటు కేంద్రీయ విద్యాల‌యాల్లో కానీ ఎస్సీ - ఎస్టీల‌కు కేటాయించిన సీట్లు మిగిలిపోతే.. వాటిని వారికే కేటాయించి - అవ‌గాహ‌న క‌ల్పించి భ‌ర్తీ చేయాలి. కానీ స్పీక‌ర్ కోడెల అలా చేయ‌కుండా.. మిగిలిపోయిన సీట్ల‌ను ఇత‌ర కులాల వారికి కేటాయించాలంటూ కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప‌రిణామంపై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఘాటుగా స్పందించారు.

ఢిల్లీలో అక్టోబర్ 10న స్పీకర్‌ కోడెల ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ - ఎస్టీ విద్యార్థుల సీట్లు ఎందుకు మిగిలిపోయాయో ఆలోచించి, వారిని చేర్చేలా చర్యలు తీసుకోవడానికి బదులు.. మిగిలిన సీట్లన్నీ ఇతరులకు లాటరీ పద్ధతిలో కేటాయించేలా జీవో ఇవ్వాలంటూ విన్నవించడం దళిత వ్యతిరేక చర్య తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు మిగిలి పోవడానికి ప్రభుత్వ ప్రచారం లేకపోవడమే కారణమన్నారు. ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా వున్న స్పీకర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి దళిత కాలనీలకు వెళ్లి కేంద్రీయ విద్యావిధానంపై అవగాహన కల్పించలేకపోయారని, వారిని ఆ విద్యాలయంలో చేర్చేలా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు.