Begin typing your search above and press return to search.

అసెంబ్లీ రెడ్ లైట్ ఏరియాగా మారింది అనేశారట

By:  Tupaki Desk   |   19 Jan 2016 4:38 AM GMT
అసెంబ్లీ రెడ్ లైట్ ఏరియాగా మారింది అనేశారట
X
అసెంబ్లీని ఎంత పవిత్రంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ.. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న తీరు కనిపిస్తున్నదే. కిందపడ్డా తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేతల తీరుతో అసెంబ్లీ నిర్వహణ ఇప్పుడు కష్టసాధ్యంగా మారింది. సభానాయకుడి మీదా.. సభాఅధ్యక్షుడి మీదా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటమే కాదు.. అసెంబ్లీ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీరు ఈ మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీలో తరచూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న రచ్చ చూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఏపీ శాసన సభ నైతిక నియమావళి కమిటీ నేతృత్వంలో ‘‘చట్టసభల్లో నైతిక విలువలు’’ అన్న చర్చాగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు పలు సలహాలు.. సూచనలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఏపీ అసెంబ్లీలో పరిస్థితులు ఎంతలా దిగజారాయన్న భావన కలగక మానదు.

గతానికి.. వర్తమానానికి మధ్యనున్న వ్యత్యాసం గురించి ప్రస్తావించిన స్పీకర్ కోడెల.. గతంలో బర్తరఫ్ అన్న మాట వాడితేనే సభాహక్కుల ఉల్లంఘన కింద పరిగణించారని.. కానీ ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాగా మారిందని వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదని కోడెల ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి అసెంబ్లీని అంతేసి మాటలు అంటున్నా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వ్యవస్థకే ప్రమాదకరమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ తరహా వ్యాఖ్యల్ని మొగ్గలోనే తుంచేయాలి. లేకుంటే మరిన్ని విపరిణామాలకు కారణమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.