Begin typing your search above and press return to search.

‘మిత్రుడ్ని’ మాట్లాడేందుకు నో చెప్పారు

By:  Tupaki Desk   |   19 Dec 2015 7:02 AM GMT
‘మిత్రుడ్ని’ మాట్లాడేందుకు నో చెప్పారు
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాల్ మనీ వ్యవహారంపై చర్చ ముగిసిపోయింది. విపక్షం వద్ద సరైన వ్యూహం లేకపోవటం.. అధికారపక్షాన్ని చర్చలతో ఇరుకున పెట్టాల్సిన సహనం లేని విపక్ష నేత జగన్ పుణ్యమా అని కాల్ మనీ అంశం కంచికెళ్లిపోయింది. కాల్ మనీ మీద హాట్.. హాట్ గా చర్చ జరగటం ఖాయమని భావించిన చాలామందికి తీవ్ర నిరాశను కలిగించింది. నిజానికి ఈ వ్యవహారం మీద చర్చ కంటే కూడా రచ్చే ఎక్కువగా జరిగింది.

శుక్రవారం దీని మీద పెద్ద చర్చ జరగని నేపథ్యంలో శనివారం.. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్.. ఈ అంశంపై మాట్లాడేందుకు తనకు 10 నిమిషాల సమయం ఇవ్వాలంటూ కోరారు. కాల్ మనీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని.. ఈ దారుణ రుణ కౌగిలిలో చిక్కుకున్న వేలాది కుటుంబాలు వీధుల్లోకి వెళుతున్నాయని.. చాలా కీలకమైన ఈ అంశంపై మాట్లాడేందుకు తనకు పది నిమిషాల సమయం కేటాయించాలని కోరారు.

అయితే.. ఈ అంశంపై చర్చ పూర్తి అయ్యిందని.. ఈ విపక్షం వేరే సందర్భంలో మాట్లాడొచ్చని ఏపీ స్పీకర్ కోడెల వ్యాఖ్యానించి.. ఈ వ్యవహారంపై చర్చ ముగిసిందని ప్రకటించటం విశేషం. అధికారపక్షంపై దూకుడుగా వెళ్లి.. డిఫెన్స్ లో పడేయాలని విపక్షం వేసిన ఐడియా వర్క్ వుట్ కాకపోవటమేకాదు.. ఆ పక్షానికి చెందిన ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడే వరకూ విషయాన్ని లాగారని చెప్పొచ్చు.