Begin typing your search above and press return to search.

కోడెల మాటల్ని కట్ చేసి వేశారట

By:  Tupaki Desk   |   20 Feb 2017 7:04 AM GMT
కోడెల మాటల్ని కట్ చేసి వేశారట
X
సీనియర్ నేతగా సుపరిచితుడు.. ఆచితూచి మాట్లాడటమే తప్పించి.. తొందరపడినట్లుగా కనిపించని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై మొన్నామధ్య వెల్లువెత్తిన వివాదాస్పద వ్యాఖ్యలన్నీ మీడియా అత్యుత్సాహంతోనేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మహిళల్ని.. తాను అవమానించేలా మాట్లాడలేదని ఆయన చెబుతున్నారు. మహిళా సమస్యల్ని తెర మీద తేవటానికి.. వాటి మీద చర్చజరగాలన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించిన తమపై ఇలాంటి విమర్శలు చేయటం తగదని చెబుతున్నారు.

మహిళల్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని కట్ చేసి.. ప్రసారం చేయటం వల్లనే వివాదం తెర మీదకువచ్చిందే తప్పించి.. తాను తప్పుగా మాట్లాడిందే లేదన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. హైదరాబాద్ కు ఆయన తాజాగా గుడ్ బై చెప్పేశారు. మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని.. ఇకపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని కోడెల స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ కు గుడ్ బై చెప్పేసిన ఆయన.. ఈ మధ్యన మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం మొత్తం కొందరు చేసిందే తప్పించి.. తాను తప్పుగా మాట్లాడిందేమీ లేదని చెప్పారు. తన మాటల్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్న ఆయన.. అసలు తానేం మాట్లాడనన్న విషయాన్ని తెలిపే సీడీని రిలీజ్ చేశారు.

కోడెల విడుదల చేసిన సీడీలో ఉన్న మాటల్ని చూస్తే.. ‘‘ఒకవాహనం షెడ్ లో పెట్టి ఉంటే ప్రమాదాలు జరగవు. రోడ్డు మీదకు వచ్చినా.. వేగం మితిమీరి ప్రయాణించినా.. ప్రమాదాలు జరుగుతాయి. మహిళలు.. గృహిణులుగా ఉంటే వారిపై వేధింపులు ఉండవు. కానీ.. ఈ కాలంలో మహిళలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబాల్ని పోషిస్తున్నారు. దీంతో.. వారు అనివార్యంగా బయటకు అందరికీ కనిపించాల్సి వస్తోంది. ఏ సమస్యలున్నా.. ఆడబిడ్డలు ధైర్యంగా చదవాలి. సమస్యల్నిఎదుర్కోవాలి. దానికి అవసరమైన మనోధైర్యం వారికివ్వాలి. చట్టాల కన్నా కూడా సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇస్తేనే అవి పరిష్కారమవుతాయి. ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచితేనే వారికి రక్షణ అనుకోకూడదు. చదివించాలి.. ఉద్యోగం చేయించాలి. సంపాదించుకొని తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఇవ్వాలి’’ అని ఉంది.

కోడెల విడుదల చేసిన సీడీలో ఆయన మాటల్ని చూస్తే.. మొదట్లో ఆయన చెప్పిన మాటల వరకూ కట్ చేసి.. దాన్ని మాత్రమే ప్రసారం చేయటంతో లేనిపోని వివాదం తెర మీదకువచ్చిందన్న అభిప్రాయం కలగక మానదు. మీడియా ఏదైనా.. ఇలాంటి తీరు సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/