Begin typing your search above and press return to search.

నాపై నాలుగుసార్లు బాంబు దాడులు

By:  Tupaki Desk   |   15 March 2016 1:26 PM GMT
నాపై నాలుగుసార్లు బాంబు దాడులు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పీక‌ర్ కోడెల శివప్రసాదరావుపై ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన అనంత‌రం స్పీక‌ర్ కోడెల మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆవేద‌న‌గా త‌న మ‌నోభావాలు పంచుకున్నారు. తనపై విశ్వాసం ఉంచిన సభకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కొంచెం బాధగా ఉందని అన్నారు. స్పీకర్‌ గా తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ఇంట్లో బాంబులు పేలాయన్న మాట వాస్తవమని, అయితే ఆ ఘటనకు, తనకూ ఎటువంటి సంబంధం లేదన్నది కూడా వాస్తవమేనని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ స్పష్టం చేశారు. తన ఇంట్లో బాంబులు పేలాయన్న విషయయమై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. తనపై నాలుగు సార్లు బాంబు దాడులు జరిగాయని తెలిపారు. ఫ్యూడల్‌ వ్యవస్థపై జరిగిన పోరాటంలో భాగంగా నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు కోడెల గుర్తు చేశారు.

నిష్ప‌క్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్నానని కోడెల ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. 35 ఏళ్లుగా వైద్య వృత్తి నిర్వర్తించానని, తాను కోరుకుని రాజకీయాల్లోకి రాలేదని, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాజ‌కీయ అరంగేట్రం చేశాన‌ని చెప్పారు. 20 ఏళ్లుగా సభలో ఉండటం వల్ల స్పీకర్‌ గా చేయగలనన్న నమ్మకం ఉందని అన్నారు. తాను చిన్నప్పుడు అనేక కష్టాలు పడ్డానని, భావి తరాలు అలాంటి కష్టాలు పడకూడదనే నా కోరిక అని కోడెల అన్నారు.