Begin typing your search above and press return to search.

కోడెల మృతి..త‌న‌యుడి స్పంద‌న‌..అంతా ఉద్విగ్నం

By:  Tupaki Desk   |   17 Sep 2019 3:59 PM GMT
కోడెల మృతి..త‌న‌యుడి స్పంద‌న‌..అంతా ఉద్విగ్నం
X
ఏపీ మాజీ స్పీక‌ర్‌ - టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఆరు సార్లు ఎమ్మెల్యే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారైతే ఈ వార్త తెలిసిన వెంట‌నే గుండెలు చిక్క‌ప‌ట్టుకున్నారు. ``ఈ వ‌య‌సులో ఈయ‌న ఎందుకు ఇలా చేశారు?`` అని నుదుళ్లు చిట్లించి మ‌రీ చ‌ర్చించుకున్నారు. కార‌ణాలు ఏమైనా అనేక మ‌లుపుల మ‌ధ్య కోడెల ఉదంతం ఇంకా ఊగిస‌లాడుతోంది. ఇదిలావుంటే, సోమ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అధికారికంగా వెల్ల‌డైన కోడెల మ‌ర‌ణ వార్త తెలిసిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క‌రూ ఒకే ఒక వ్య‌క్తిపై దృష్టి పెట్టారు. ``ఆయ‌న ఎక్క‌డ‌?`` ``ఆయ‌న స్పందించ‌రేంటి?`` ``ఎక్క‌డికి వెళ్లిపోయారు?`` ``ఏం జ‌రిగింది?`` ``ఆయన క‌నిపిస్తేనే త‌ప్ప విష‌యం ఏంటో అర్ధం కాదు`` ఇలా అనేక వ్యాఖ్య‌లు ఆ ఒక్క వ్య‌క్తి చుట్టూ తిరిగాయి.

ఆ ఒక్క వ్య‌క్తే.. కోడెల కుమారుడు డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌. కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌మ‌యంలో(హైద‌రాబాద్‌) శివ‌రామ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అంద‌రి దృష్టీ కోడెల కుటుంబంపై ప‌డిన‌ప్పుడు ప్ర‌ధానంగా కుమారుడిపై చ‌ర్చ జోరుగా సాగింది. అయితే, అంద‌రినీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్విగ్నంగా ఎదురు చూసేలా చేసిన శివ‌రామ్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నేరుగా ఏపీకి చేరుకున్నారు. కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌మ‌యంలో ఆయ‌న కెన్యా దేశంలో ఉన్నారు.

కెన్యా నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న శివరామ్.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం వచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌లు సంఖ్య‌లో మీడియా గొట్టాలు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర గ‌ద్గ‌ద స్వ‌రంతో మాట్లాడారు. తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని.. తాను ఈ పరిస్థితిలో ఏమీ మాట్లాడలేనని శివరామ్ వ్యాఖ్యానించారు. అనంత‌రం కారులో విజ‌య‌వాడ దిశ‌గా వెళ్లిపోయారు. కాగా , కోడెల పార్థివ దేహాన్ని మంగ‌ళ‌వారం సాయంత్రానికి హైద‌రాబాద్ నుంచి ర్యాలీగా గుంటూరుకు త‌ర‌లించారు. రేపు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ రోజు రేపు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కూడా ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం కోడెల ఇంట్లోనే ఉంచ‌నున్నారు. అనంత‌రం - కొద్దిసేపు గుంటూరులోని ఏపీ టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యానికి త‌ర‌లించి అంతిమ నివాళులు అర్పించ‌నున్నారు. ఇదిలావుంటే - కోడెల అంత్య‌క్రియ‌ల‌ను అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.