Begin typing your search above and press return to search.

ఇక రాయ‌పాటి వ‌ర్సెస్ కోడెల‌!

By:  Tupaki Desk   |   1 March 2017 6:15 AM GMT
ఇక రాయ‌పాటి వ‌ర్సెస్ కోడెల‌!
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు స‌త‌మ‌తం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య విబేధాలున్నాయి. అస‌లు గ్రూపు త‌గాదాలు లేని టీడీపీ జిల్లా శాఖ‌లు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. వీటన్నింటికీ ప‌తాక శీర్షిక అన్న‌ట్టుగా గుంటూరు టీడీపీలో నిన్న చోటుచేసుకున్న ఓ ఘ‌ట‌న‌ను చెప్పొచ్చు. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాదరావు - మొన్న‌టిదాకా కాంగ్రెస్ లో ఉండి ఇటీవ‌లే టీడీపీలో చేరిన న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వ‌ర్గాల మ‌ధ్య వాదులాట నెల‌కొంది. రాయ‌పాటి త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు స్వ‌యంగా రంగంలోకి దిగ‌గా... కోడెల కుమారుడు కోడెల శివ‌రాం తెర వెనుక ఉండే మంత్రాంగాన్ని న‌డిపారు. ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న ఈ వివాదం ఒక్క టీడీపీలోనే కాకుండా అన్నీ పార్టీల్లోనూ ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌నే చెప్పాలి.

ఈ వివాదం పూర్తి వివ‌రాల్లోకెళితే... న‌ర‌స‌రావుపేట‌కే చెందిన‌ప్ప‌టికీ... కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మొన్న‌టి ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేశారు. స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం స్పీక‌ర్‌ గా కొన‌సాగుతున్నారు. అయినా.. ఇప్ప‌టికీ ఆయ‌న న‌ర‌స‌రావుపేటను త‌న చెప్పుచేతల్లోనే పెట్టేసుకున్నారు. మ‌రోవైపు మొన్న‌టిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇటీవ‌లే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ర‌స‌రావుపేట లోక్‌ స‌భ స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఫ‌లితంగా మొన్న‌టిదాకా రాజ‌కీయంగా వైరివ‌ర్గాలుగా ఉన్న కోడెల‌ - రాయ‌పాటిలు ఒకే పార్టీలోకి చేరిన‌ట్టైంది. అసెంబ్లీ స్పీక‌ర్ గా కోడెల కీల‌క ప‌ద‌విని పొంద‌గా, రాయ‌పాటి కూడా ఎంపీగా త‌న స్థాయికి త‌గ్గ ప‌ద‌విలోనే ఉన్నారు. చాలా కాలం నుంచి ఇరు వ‌ర్గాల మ‌ధ్య కొన‌సాగుతూ వ‌స్తున్న వ‌ర్గ పోరు... ఇద్ద‌రు నేత‌లు ఒకే పార్టీలోకి చేరినంత ఈజీగా స‌మ‌సిపోలేదు.

అయితే అంత‌ర్గ‌తంగా ఎన్ని స‌మ‌స్య‌లున్నా... ఇరువురు కూడా నిన్న‌టిదాకా బ‌య‌ట‌కు స‌ర్దుకుని పోతున్న‌ట్టే క‌నిపించారు. అయితే నిన్న న‌ర‌స‌రావుపేట మండ‌లం పాల‌పాడుకు చెందిన స్థానిక నేత పులిమి రామిరెడ్డి త‌న భార్య‌తో స‌హా త‌నకు తాను గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇందుకు గ‌ల కార‌ణాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. పాల‌పాడులో ఎంపీ నిధుల‌తో ప‌లు అభివృద్ధి పనులు చేప‌ట్టారు. గ్రామానికి చెందిన రామిరెడ్డి ఈ ప‌నుల‌ను స్వ‌యంగా ద‌గ్గ‌రుండి మ‌రీ చేయించారు. ప‌నులు పూర్తి అయిన త‌ర్వాత నిన్న వాటికి ఎంపీ రాయ‌పాటి చేత ప్రారంభోత్స‌వం చేయించాల‌ని ఆయ‌న త‌ల‌చారు. ఇందుకు ఎంపీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా... ప్రారంభోత్స‌వ ఏర్పాట్లు జ‌రిగిపోయాయి.

ఈ ఏర్పాట్ల‌లో భాగంగా వెల‌సిన ఫ్లెక్సీల్లో అంత‌టా రాయ‌పాటి వ‌ర్గ‌మే క‌నిపించ‌గా, కోడెల గానీ, ఆయ‌న కుమారుడు శివ‌రాం ఫొటోలు గానీ క‌నిపించ‌లేదు. దీనిపై కోడెల వ‌ర్గం శివ‌రాంకు ఫిర్యాదు చేశాయి. తెర వెనుక మంత్రాంగం న‌డిపిన కోడెల శివ‌రాం... రాయ‌పాటి ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యేలా చేశారు. త‌న తండ్రి శివ‌ప్ర‌సాద‌రావుతో రాయ‌పాటికి ఫొన్ చేయించిన శివ‌రాం రాయ‌పాటి ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేయించిన‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ విష‌యం తెలియ‌డంతో రామిరెడ్డి ఆగ్ర‌హోద‌గ్రుడ‌య్యారు. కోడెల వ‌ర్గం వైఖ‌రిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ త‌న భార్య‌తో స‌హా ఇంటిలోకి వెళ్లి స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. 24 గంట‌ల్లోగా రాయ‌పాటి అక్క‌డికి రాక‌పోతే ఆత్మ‌హ‌త్య‌కు కూడా వెనుకాడేది లేద‌ని తేల్చిచెప్పారు.

స‌మాచారం అందుకున్న రాయ‌పాటి కుమారుడు రంగారావు హుటాహుటిన పాల‌పాడుకు చేరుకున్నారు. రామిరెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపారు. కోడెల వ‌ర్గంపై రంగారావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఫ్లెక్సీల్లో ఫొటోలు లేకుంటేనే కార్య‌క్ర‌మాలు ర‌ద్ద‌య్యేలా చేస్తారా? అంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రామిరెడ్డి.. కోడెలతో పాటు ఆయ‌న కుమారుడిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కోడెల‌తో పాటు ఆయ‌న కుమారుడు కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని, అలాంటి వారిని పిల‌వాల్సిన అవ‌స‌రం త‌మకు లేద‌ని తేల్చేశారు. అంతేకాకుండా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న కోడెల‌కు న‌ర‌స‌రావుపేట‌లో ఏం ప‌ని అంటూ కూడా ఆయ‌న కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. రంగారావే ద‌గ్గ‌రుండి మ‌రీ రామిరెడ్దితో ఈ ఆరోప‌ణ‌లు చేయించార‌ని కోడెల వ‌ర్గం భావిస్తోంది. భ‌విష్య‌త్తులో ఈ వివాదం ఎంత‌దాకా వెళుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/