Begin typing your search above and press return to search.

కోడి కత్తి కేసు : టీడీపీకి సంబంధం లేదన్న ఎన్‌ఐఏ

By:  Tupaki Desk   |   17 April 2023 9:00 PM
కోడి కత్తి కేసు : టీడీపీకి సంబంధం లేదన్న ఎన్‌ఐఏ
X
విశాఖ ఎయిర్ పోర్టులో  అయిదేళ్ల క్రితం జరిగిన కోడితో జగన్ మీద దాడి కేసులో కుట్ర కోణం ఉందని ఆయన తరఫున న్యాయవాదులు ఈ రోజు ఎన్‌ఐఏ  కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసు విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిందే అని కోరారు. నిందితుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

ఈ కేసులో నిందితుడు అయిన జె శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధికరంలో ఉన్నపుడు జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం మంజూరు చేశారని కూడా పేర్కొన్నారు. నేర నేపధ్యం తో పాటు తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తికి ఎయిర్ పోర్టులో ఎలా ఉద్యోగం ఇచ్చారని కూడా జగన్ లాయర్లు ప్రశ్నించారు.

అంతే కాదు ఈ హత్యాయత్నం కేసు వెనక ఉన్న కుట్రను చేదించాలని కూడా వారు కోరారు. మరో వైపు ఈ కేసులో వేరే దర్యాప్తు అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫున న్యాయవాదులు వాదించింది. పైగా ఈ కేసులో ఎయిర్ పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రమేయం లేదని కూడా ఎన్‌ఐఏ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ జగన్ తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ మీద తమ వాదనలు వినిపించేందుకు గడువును ఎన్‌ఐఏ కోరింది.

దాంతో ఈ కేసుని ఈ నెల 20కి వాయిదా వేశారు ఇదిలా ఉండగా  ప్రస్తుత సీఎం అప్పటి విపక్ష నేత అయిన జగన్ మీద 2018  అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కోడిపందాల్లో ఉపయోగించే చిన్న కత్తితో జె.శ్రీనివాస్ రావు అనే రెస్టారెంటు కార్మికుడు దాడి చేశాడు. అలా జగన్ చేతికి గాయమైంది. దాంతో ఈ కోడి కత్తు కేసు ఏపీలో సంచలనం అయింది. దీని మీద నాటి టీడీపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసినా వాగ్మూలం ఇవ్వడానికి జగన్ నిరాకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న  సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల కోసం హై కోర్టుని ఆశ్రయించారు. ఇక తనను హత్య చేయడానికి టీడీపీ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ వైసీపీ రాజకీయ దుమారమే రేపింది. దాంతో హై కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అదే ఏడాది  డిసెంబర్ 31 ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. అలా ఎన్‌ఐఏ 2019 జనవరి 1న కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది.

ఇప్పటికి పలు దఫాలుగా దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ ఇందులో కుట్ర కోణం ఏదీ లేదని తేల్చడం జరిగింది. అయితే సమగ్ర విచారణ జరగాలని   కుట్ర కోణం ఉందని జగన్ తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. మరి ఈ నెల 20న ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ న్యాయవాదులు ఏ రకమైన వాదనలు వినిపిస్తారో దాని మీద ఎన్‌ఐఏ కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాలి.