Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికాతో వన్డేలకు కోహ్లి దూరం?

By:  Tupaki Desk   |   14 Dec 2021 10:40 AM GMT
దక్షిణాఫ్రికాతో వన్డేలకు కోహ్లి దూరం?
X
టీమిండియా ఏ ముహూర్తనా దక్షిణాఫ్రికా టూర్ పెట్టుకుందో గానీ.. ఒకదాని వెంట ఒకటి మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అంతా సాఫీగా ఉండి బయల్దేరడమే తరువాయి అని అనుకుంటుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో అడ్డంకి వచ్చింది.

అసలు సిరీస్ సాగుతుందా? లేదా? అని అనుమానం తలెత్తింది. అయితే, వేరియంట్ ఉన్నప్పటికీ పర్యటనను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. షెడ్యూల్ ను ఒక వారం ముందుకు జరిపింది. ఈ నెల 17న ప్రారంభం కావాల్సిన సిరీస్ 26వ తేదీ నుంచి మొదలుకానుంది. ఇక సిరీస్ కు సిద్ధమయ్యే క్రమంలో విరాట్ కోహ్లి వన్డే కెప్టెన్సీపై వేటు వేసి సెలక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు.

కోహ్లి స్థాయి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం పెద్ద సంచలనమే అయింది. దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినా.. కోహ్లికి సమయం ఇచ్చి వైదొలగాలని కోరారని, అతడి నుంచి స్పందన లేకపోవడంతో సెలక్టర్లే వన్డే కెప్టెన్సీ నుంచి పక్కనబెట్టారని తేలింది. సీనియర్ బ్యాట్స్ మన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చి వన్డేల్లో జట్టును నడిపించమని కోరారు. ఇదే సమయంలో టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి అజింక్య రహానే పక్కనబెట్టి రోహిత్ కే ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతానికి జట్టులో చోటు ఇచ్చినా.. పూర్తిగా ఫామ్ కోల్పోయిన రహానేకు ఓ హెచ్చరిక పంపారు.

రోహిత్ దూరమయ్యాడనుకుంటే.. కోహ్లికూడా

పరిస్థితులను చూస్తుంటే టీమిండియాలో ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అనూహ్యంగా పాత గాయం (తొడ కండరాలు) తిరగబెట్టడంతో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో వన్డేల్లో జట్టును నడిపించేంది ఎవరు? అనే ప్రశ్న తలెత్తగా, మంగళవారం విరాట్ కోహ్లి పెద్ద షాకిచ్చాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (జనవరి 19 నుంచి 23 వరకు)కు తాను దూరంగా ఉండడనున్నట్లు ప్రకటించాడు. మంగళవారం ఈ విషయాన్ని ఓ అధికారి వెల్లడించినట్లు సమాచారం.

ఇది అధికారికంగా కోహ్లి నుంచి వచ్చని ప్రకటన కాదని భావించినా.. ఒకవేళ నిజమైతే గనుక జట్టులో ఏదో తేడా జరుగుతోందని అనుకోవాల్సి ఉంటుంది. తనకు ఇష్టం లేకున్నా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు ప్రతీకారంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడా? అని అనుమానం తలెత్తుతోంది. అయితే, వన్డే సిరీస్ నాటికి రోహిత్ కోలుకుంటాడని, కెప్టెన్సీ చేపడతాడని ఓ అధికారి స్పష్టం చేశారు.

పైకి బాగానే ఉన్నా..

కోహ్లికి వన్డేల్లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డుంది. దానిని పరిగణనలోకి తీసుకోకుండా కెప్టెన్సీ నుంచి తీసేయడం కొంత ఇబ్బందికరమే. కాకపోతే పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా ఎప్పుడూ ఇద్దరు కెప్టెన్లతో బరిలో దిగలేదు. కాగా, ఇది సెలక్టర్లు తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు చెప్పే మాట అని కోహ్లి అభిమానులు దెప్పి పొడిచారు కూడా.

మరోవైపు కోహ్లి కెప్టెన్సీ ప్రత్యేకత, విశిష్టత

గురించి రోహిత్ శర్మ ప్రకటన చేసినా, కోహ్లి మాత్రం రోహిత్ గురించి పెద్దగా మాట్లాడినట్లు బయటకు రాలేదు. దీన్నిబట్టి కెప్టెన్సీ తీసేయడంపై కోహ్లి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని తెలుస్తోంది. సరిగ్గా.. రోహిత్ గాయంతో దూరమైన సిరీస్ లోనే అతడూ వన్డేల నుంచి తప్పుకోవాలని భావించడం వెనుక లోతైన అర్థం ఉందనిపిస్తోంది.

వారియర్ లాంటి విరాట్ అలా చేస్తాడా?

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కోహ్లి నిజంగానే దూరంగా ఉంటే అనుమానాలు బలపడతాయి. అయితే, కోహ్లి లాంటి పోరాటశీలి, పక్కా ప్రొఫెషనల్ ఆటగాడు జట్టుకు అవసరమైన సందర్భంలో ఇలా చేస్తాడా? అంటే చేయడనే చెప్పగలం. కానీ, అతడి మనసులో ఆలోచనలు, భావాలు ఎలా ఉన్నాయో ఎవరూ నికరంగా చెప్పలేం కదా? ఏదేమైనా.. టీమిండియాలో ఎలాంటి స్పర్థలు లేవనే మనం అనుకుందాం..