Begin typing your search above and press return to search.

కోహ్లి చితక్కొట్టాడు.. ఎక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   8 Jun 2022 4:30 PM GMT
కోహ్లి చితక్కొట్టాడు..  ఎక్కడో తెలుసా?
X
అతడు సెంచరీ చేయక రెండున్నరేళ్లయింది.. అసలు సరైన ఇన్నింగ్స్ ఆడక రెండేళ్లయింది.. జట్టును ఎన్నో మ్యాచ్ ల్లో ఒంటిచేత్తో గెలిపించిన అతడు నిలకడగా ఆడక చాన్నాళ్లయింది. కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆర్నెళ్లయింది. ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ లోనూ అతడు వీర విహారం చేసిందేమీ లేదు.. కానీ, అతడి హవా తగ్గలేదు.. ఇంకా పెరిగింది. తన పేరిట రికార్డులు లేక కొన్నాళ్లవుతున్నా.. ఈ రికార్డు మాత్రం అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది. అతడే టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్ కోహ్లి.

మైదానంలో తగ్గినా.. సోషల్ మీడియాలో తగ్గలే..ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. యూ ట్యూబ్ లో ఎంతమది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు..? ట్విటర్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు..? వాట్సాప్ లో ఎంతమంది మన స్టేటస్ చూస్తున్నారు అనేదే అందరికీ స్టేటస్ అయిపోయింది. ఇక వీటికి అధునాతన వెర్షన్ "ఇన్ స్టాగ్రామ్". ఇందులో రీల్స్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అలాంటి ఇన్ స్టాలో 200 మిలియన్ల (20 కోట్లు) ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా నిలిచాడు కోహ్లి.

'200 మిలియన్‌ స్ట్రాంగ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మద్దతు ఇస్తోన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అనే క్యాప్షన్‌తో కోహ్లీ కెరీర్‌లో సాధించిన మైలురాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకున్నాడు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకడైన కోహ్లి స్థాయికిది తగినదే.

మైదానంలో లాగే సోషల్ మీడియాలో నూ చురుగ్గా ఉంటాడు కోహ్లి. తరచూ మ్యాచ్‌లకు సంబంధించిన ఫొటోలతో పాటు జిమ్‌ చేస్తున్న వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు. అప్పుడప్పుడు భార్య అనుష్క శర్మతో కలిసి వంట చేసిన వీడియోలతోపాటు ఇద్దరూ కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి దిగిన ఫొటోలను పంచుకుంటాడు.

ఫుట్ బాలర్ల తర్వాత కోహ్లినే..సోషల్‌ మీడియాలో కోహ్లి క్రేజ్ అంతాఇంత కాదు. అయితే, ప్రపంచ క్రీడ అయిన ఫుట్ బాల్ లో కోహ్లి కంటే అత్యధిక ఆదరణ ఉన్నవారు అర్జెంటీనా స్టార్ లయోనల్ మెస్సీ. పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరికీ ఇన్ స్టాలో వరుసగా 40.51 కోట్ల మంది, 33.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు కోహ్లి కంటే ఏడెనిమదేళ్ల ముందు నుంచే వీరు అంతర్జాతీయ స్టార్లు. అంతేగాక ఫుట్ బాల్ క్రీడా స్థాయిని బట్టి చూస్తే వీరికి ఈ మాత్రం ఫాలోవర్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు.

అయితే, ఫుట్ బాల్ ఆట అంతగా క్రికెట్ ఎక్కువ దేశాల్లో లేదు. అందుకనే కోహ్లి వారికి సగందూరంలోనే నిలిచిపోయాడు. ఈ లెక్కన ఓ విధంగా చూస్తే.. కోహ్లి దాదాపు వారికి సమానమే అని అనుకోవాలి. కాగా, దక్షిణాఫ్రికాతో రేపటినుంచి ప్రారంభంకానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. ఇంగ్లండ్ లో వచ్చే నెలలో జరుగనున్న టెస్టు మ్యాచ్ కు అతడు తాజాగా బరిలో దిగనున్నాడు. చూద్దాం.. ఇన్ స్టాలో లాగానే అక్కడా సెంచరీ బాదేస్తాడేమో?