Begin typing your search above and press return to search.

లార్డ్స్‌లో కోహ్లీ నాగినీ డ్యాన్స్.. గంగూలీని గుర్తు చేసుకుంటోన్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   16 Aug 2021 11:30 AM GMT
లార్డ్స్‌లో కోహ్లీ నాగినీ డ్యాన్స్.. గంగూలీని గుర్తు చేసుకుంటోన్న ఫ్యాన్స్
X
క్రికెట్ చరిత్ర లో లార్డ్స్ గ్రౌండ్ కు ఓ ప్రత్యేకతమైన గుర్తింపు ఉంది. క్రికెట్ ఆట పుట్టింది అక్కడే. ఆ మైదానం ను అందరూ చాలా స్పెషల్‌ గా చూస్తారు. లార్డ్స్ గ్రౌండ్ లో సెంచరీ చేయాలని బ్యాట్స్‌మన్‌. ఐదు వికెట్ల ప్రదర్శన చేయాలని బౌలర్ కోరుకుంటాడు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ అరుదైన ఫీట్ అందుకుంటారు. ఇక లార్డ్స్ బాల్కనీ లో నిలబడి ప్రతి ప్లేయర్ ఆనందపడుతుంటాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలబడి ఆనందపడ్డాడు. అంతటి తో ఆగకుండా డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌‌లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం మ్యాచ్‌ లో నాలుగో రోజు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరగానే పెవిలియన్ చేరారు. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే తన అనుభవంతో భారత జట్టు ఇన్నింగ్స్‌ ను గాడిలో పెట్టారు. ఒకవైపు భారత బ్యాట్స్‌మెన్ మైదానంలో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు బాల్కనీలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్‌ తో సహా జట్టులోని కొంతమంది సభ్యులతో కలిసి లార్డ్స్ గ్రౌండ్ బాల్కనీలో ఎంజాయ్ చేశాడు.

ఈ సమయంలో కోహ్లీ ప్రవర్తనను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ నాగినీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ లార్డ్స్ బాల్కనీలో నాగినీ డ్యాన్స్ భంగిమలో కనిపించడంతో ఆయన అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని లార్డ్స్‌ లో చేసిన హంగామాను గుర్తుచేసుకుంటున్నారు. నాట్‌ వెస్ట్ ట్రోఫీ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, గంగూలీ చొక్కా విప్పి గిర గిరా తిప్పుతూ సందడి చేశాడు. అయితే మరికొంతమంది మాత్రం ఈ ఉత్సాహం పరుగులు చేయడంలో చూపించాలంటూ కోహ్లీపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, కోహ్లీ డాన్స్ చేస్తు్న్న సమయంలో తోటి ఆటగాళ్లు అతన్ని చూసి నవ్వుతూ కనిపించారు.

రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఔట్ అయిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ ఆఫ్ స్టంప్‌ కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడిన కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4) వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్ దక్కడంతో కరన్ మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి ఎగురుతూ తనడైన శైలిలో పంచ్‌ లు విసిరాడు. తీవ్ర నిరాశలో పెవిలియన్‌ కి వెళ్లిన కోహ్లీ, తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూములో కోహ్లీ తన టవల్‌ తో చెమటలు తుడుచుకుని.. అదే టవల్‌ను అద్దానికి విసిరికొట్టాడు. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది.

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ లో ఇంగ్లండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లో సెంచరీ సాధించిన రాహుల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. రోహిత్ కొద్దిసేపు అలరించినా భారీ షాట్‌కు ప్రయత్నించి 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. కోహ్లీ(20) మరోసారి నిరాశ పరిచాడు. అయితే పుజారా(45)-రహానె(61) జోడీ శతక భాగస్వామ్యంతో టీమిండియా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. పంత్ కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 22 పరుగులకే పంత్ అవుట్ అయ్యి పెవిలియన్ కి చేరాడు. ప్రస్తుతానికి 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు రాబట్టింది. ఇషాంత్ శర్మా , షమీ క్రీజ్ లో ఉన్నారు.