Begin typing your search above and press return to search.

కోహ్లి.. రహానె చితగ్గొట్టేశారుగా..

By:  Tupaki Desk   |   9 Oct 2016 10:37 AM GMT
కోహ్లి.. రహానె చితగ్గొట్టేశారుగా..
X
న్యూజిలాండ్ తో తొలి రెండు టెస్టులో ముందు తడబడి.. ఆ తర్వాత పుంజుకుని విజయాలు సాధించిన భారత్.. మూడో టెస్టులో ఆరంభం నుంచే దుమ్ముదులిపేస్తోంది. తొలి రోజు కోహ్లి సెంచరీ.. రహానె అర్ధసెంచరీ చేయడంతో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు మరింతగా చెలరేగింది. వీళ్లిద్దరూ కివీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ మధ్యే వెస్టిండీస్ పర్యటనలో తన తొలి డబుల్ సెంచరీ సాధించిన విరాట్.. తన తర్వాతి సిరీస్ లోనే మరో డబుల్ కొట్టేశాడు. శనివారం 103 పరుగులతో ఆట ముగించిన కోహ్లి.. ఆదివారం 211 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తం 366 బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి 20 ఫోర్లతో ఈ స్కోరు చేశాడు. చివరికి అతడిని జీతన్ పటేల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు.

మరోవైపు తొలి రోజు 79 పరుగులతో ఉన్న రహానె కూడా రెండో రోజు చెలరేగాడు. అతను 150 మార్కును దాటాడు. అతను 180 పరుగులతో ఆడుతున్నాడు. రహానె జోరు చూస్తుంటే అతను కూడా డబుల్ సెంచరీ చేసేలా ఉన్నాడు. కోహ్లి - రహానె నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 365 పరుగులు జోడించడం విశేషం. కడపటి వార్తలందేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 483 పరుగులు చేసింది. రహానెకు తోడు రోహిత్ క్రీజులో ఉన్నాడు. భారత్ ఊపు చూస్తుంటే ఈ మ్యాచ్ లో సైతం భారీ విజయంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేలాగే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/