Begin typing your search above and press return to search.

కోల్ క‌తా మెట్రో రైలు ప్రాణం తీసింది.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   14 July 2019 5:35 AM GMT
కోల్ క‌తా మెట్రో రైలు ప్రాణం తీసింది.. ఎలానంటే?
X
కోల్ క‌తా మెట్రో స్టేష‌న్ లో చోటు చేసుకున్న విషాదం విన్నంత‌నే అయ్యో అనుకోకుండా ఉండ‌లేం. మెట్రో రైలుకు సంబంధించిన ఒక లోపాన్ని తాజా ఉదంతం గుర్తించేలా చేసింది. దేశంలోని ఇత‌ర మెట్రోల‌లో కూడా ఇలాంటి దారుణానికి అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కూ కోల్ క‌తాలో చోటు చేసుకున్న విషాద ఉదంతం చూస్తే..

కోల్ క‌తాలోని పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేష‌న్ లో శ‌నివారం సాయ‌త్రం 66 ఏళ్ల స‌జ‌ల్ కుమార్.. రైలు ఎక్కే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌టికే మెట్రో రైలు నిండిపోవ‌టంతో.. ఆయ‌న బ‌య‌టే ఉండిపోయారు. పొర‌పాటున ఆయ‌న చేయి డోర్ లో ఇరుక్కుంది. ఇది గ‌మ‌నించ‌కుండానే రైలు స్టార్ట్ అయ్యింది. క‌న్ను మూసి తెరిచే స‌రికి రైలు స్టార్ట్ కావ‌టం.. స‌జ‌ల్ ను ఈడ్చుకెళ్ల‌టం జ‌రిగిపోయాయి. గుర్తించిన త‌ర్వాత రైలును ఆపే స‌మ‌యానికి ఆయ‌న ప‌ట్టాల మీద ప‌డి.. తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు.

హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్లుగా గుర్తించారు. మెట్రో త‌లుపుల‌కు ఉండే సెన్సార్లు ప‌ని చేయ‌క‌పోవ‌టంతోనే ఈ ప‌రిస్థితి ఎదురైన‌ట్లు చెబుతున్నారు. సాధార‌ణంగా లిఫ్టు డోర్ల మాదిరే.. మెట్రో త‌లుపులు ప‌ని చేస్తాయి. డోర్లు ప‌డేందుకు ఎవ‌రైనా అడ్డు ఉన్న‌ప్పుడు అవి ద‌గ్గ‌ర‌కు రాకుండా ఆగిపోయి.. మోత మోగుతుంది. సెన్సార్లు ప‌ని చేయ‌క‌పోవ‌టంతో అవి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయ‌టం.. అందులో చెయ్యి ఇరుక్కుపోవ‌టం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం కోల్ క‌తా మెట్రోకే కాదు.. ఏ మెట్రోలో అయినా చోటుచేసుకునే అవ‌కాశం ఉంది. కోల్ క‌తా మెట్రో విషాదాంతం త‌ర్వాతైనా.. డోర్ల‌కు ఏర్పాటు చేసిన సెన్సార్ల నిర్వ‌హ‌ణ త‌ర‌చూ నిర్వ‌హించ‌టం.. వాటి ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తే.. ఇలాంటి విషాద ఉందంతాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఇక‌.. ఈ విషాదానికి బాధ్యులుగా చేస్తూ.. ప‌లువురిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ప్రాణం పోయిన త‌ర్వాత ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటే మాత్రం.. పోయిన ప్రాణం తిరిగి రాదుగా?