Begin typing your search above and press return to search.

పళని బలపరీక్ష ‘స్టార్ల’కు నచ్చలేదు

By:  Tupaki Desk   |   19 Feb 2017 4:47 AM GMT
పళని బలపరీక్ష  ‘స్టార్ల’కు నచ్చలేదు
X
గడిచిన కొద్దిరోజులుగా తమిళనాట చోటు చేసుకున్న పొలిటిక థ్రిల్లర్.. శనివారం నిర్వహించిన బలనిరూపణ పరీక్షతో ఒక కొలిక్కి రావటం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. ఎట్టకేలకు బలపరీక్ష పూర్తి కావటం.. పళని స్వామి మెజార్టీని సాధించటంపై తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖులు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

బలపరీక్ష జరిగిన తీరు.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై తమిళ ప్రముఖ తారలంతా ఫైర్ అయ్యారు. గడిచిన పన్నెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందించిన వారే.. ఈసారీ స్పందించటం గమనార్హం. ‘మరో కొత్త సీఎం వచ్చినట్లే కనిపిస్తోంది.జై డె‘మాక్’ క్రజీ అని వ్యంగ్యంగా పేర్కొంటూ.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందంటూ ట్వీట్ చేశారు లోకనాయకుడిగా పేరున్న కమల్ హాసన్. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో స్వాగతం పలుకుతారంటూ వార్నింగ్ ఇచ్చేశారాయన.

ఇక.. సినీ నటి కమ్ పొలిటీషియన్ ఖుష్బూ రియాక్ట్ అవుతూ.. ప్రజాస్వామ్యానికి బలమే ప్రతిపక్షమని.. అలాంటి ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష జరపటాన్ని ఆమె తప్పు పట్టారు. ఇక.. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు రాధికా శరత్ కుమార్. ఇక యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిన అరవింద్ స్వామి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన బలపరీక్షను ఎవరూ అంగీకరించరని.. ఎమ్మెల్యేలను కలవాల్సింది ప్రజలను కానీ.. రిసార్ట్స్ లోని పార్టీ నేతలను కాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని కవర్ చేయకుండా.. ఎంపిక చేసిన కొన్నిదృశ్యాలను మాత్రమే రిలీజ్ చేయటం సరికాదని..ఇది సిగ్గుచేటు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అంకెల ఆటతో ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టలేరని.. ప్రజాస్వామ్యం ప్రజల గళమని.. దాన్ని కాపాడాలని పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిని చేయాలంటూ వ్యాఖ్యానించారు నటి గౌతమి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/