Begin typing your search above and press return to search.

దేవినేనిపై కొలుసు సెటైర్ విన్నారా?

By:  Tupaki Desk   |   18 April 2017 1:38 PM GMT
దేవినేనిపై కొలుసు సెటైర్ విన్నారా?
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు... చంద్రబాబు కేబినెట్‌ లో కీల‌క శాఖ మంత్రే. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఎగువ రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌ - మ‌హారాష్ట్ర‌ల కంటే కూడా పొరుగు రాష్ట్రంగానే కాకుండా మ‌రో ఎగువ రాష్ట్రంగా జాబితాలోకి వ‌చ్చేసిన తెలంగాణ‌తో నీటి వాటాల‌పై నిత్యం వాదులాట‌లు జ‌రుగుతున్న త‌రుణంలో దేవినేని పాత్ర కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి పంచాయితీల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు అప్పుడెప్పుడో చ‌ర్చ‌ల కోస‌మంటూ ఢిల్లీ బాట ప‌ట్టిన దేవినేని... తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుతో కోరి త‌గ‌వు తెచ్చుకున్నార‌న్న వాద‌న వినిపించింది. కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన స‌ద‌రు చ‌ర్చ‌ల్లో హ‌రీశ్ ముందు బుద్ధిమంతుడిగానే క‌నిపించిన దేవినేని... మీటింగ్ ముగియ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియా ముందు శివాలెత్తిపోయారు. సాగు నీటి ప్రాజెక్టుకు సంబంధించి దేవినేని తీరు ఇలాగే ఉంటుందంటూ నాడు హ‌రీశ్ చేసిన ఎదురు దాడి కూడా ఏ ఒక్క‌రూ మ‌రిచిపోలేనిదే.

ఈ క్ర‌మంలో పోల‌వ‌రంపై కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు చంద్రబాబు స‌ర్కారు ఆడుతున్న నాట‌కాల‌ను జ‌నాల‌కు తెలిపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్ర‌రావు... కేంద్రానిని వ‌రుస‌గా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం ఖర్చు తామే భ‌రిస్తామ‌న్న కేంద్రం ప్ర‌క‌ట‌న‌, దానిపై బాబు అండ్ కో చేస్తున్న ప్ర‌చారంలోని అస‌లు రంగును ఆయ‌న బ‌య‌ట‌పెట్టేశారు. తాజాగా పున‌రావాసం బాధ్యత ఎవ‌రిదో చెప్పాల‌ని కూడా కేవీపీ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ‌కు స‌మాధానం వ‌స్తే... త‌మ‌కు రెండో మొట్టికాయ త‌ప్ప‌ద‌న్న భావ‌నో, ఏమో తెలియ‌దు గానీ... నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన దేవినేని... అటు కేవీపీతో పాటు ఇటు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ - ఆ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. దేవినేని వ్యాఖ్య‌ల‌పై వేగంగానే స్పందించిన వైసీపీ కీల‌క నేత‌ - మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి నిన్న మీడియా ముందుకు వచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేవినేనిని ద‌ద్ద‌మ్మ‌తో పోల్చిన కొలుసు... త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి అస‌లు విష‌యాల‌ను వెల్లడించాల‌ని డిమాండ్ చేస్తే... స‌మాధానం చెప్పాల్సిన బాబు అండ్ బ్యాచ్ రాద్ధాంతం చేయ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌రైన స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త ఉన్న దేవినేని వ్యాఖ్య‌లు బాధ్య‌తార‌హితంగా ఉన్నాయ‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై పెరిగిన అంచనాల మొత్తాన్ని ఎవరు భరిస్తారనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. దీనికి సమాధానం చెప్పలేక దేవినేని దద్దమ్మలా మాట్లాడుతున్నారని, పోలవరాన్ని వైసీపీ అడ్డుకుంటోందంటూ ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే తమపైనే బురద జల్లుతారా అని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/