Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ హైక‌మాండ్‌కు అంత సీన్ లేదంటోన్న కోమ‌టిరెడ్డి!

By:  Tupaki Desk   |   3 Sep 2021 6:35 AM GMT
కాంగ్రెస్ హైక‌మాండ్‌కు అంత సీన్ లేదంటోన్న కోమ‌టిరెడ్డి!
X
టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కాన్ని కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌దవి కోసం ఆశ‌ప‌డ్డ త‌న‌కు భంగ‌పాటు ఎదురైంది. దీంతో పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న‌వాళ్ల‌ను కాద‌ని.. బ‌య‌ట నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల‌కు ఆ ప‌ద‌వి ఎలా క‌ట్ట‌బెడ‌తారంటూ అధిష్ఠానంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. అప్ప‌టి నుంచి రేవంత్‌కు దూరంగానే ఉంటున్నారు. రేవంత్‌పైనా విమ‌ర్శ‌లు చేసిన కోమ‌టిరెడ్డి ఆ త‌ర్వాత కాస్త మెత్త‌బ‌డ్డ‌ట్లు క‌నిపించినా.. తాజాగా వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు హాజ‌రైన త‌ర్వాత చేసిన త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ వేడి ర‌గిల్చారు.

వైఎస్ సంస్మ‌ర‌ణ పేరుతో ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ నిర్వ‌హించిన ఈ స‌భపై రాజ‌కీయ ప్ర‌భావం ఉంద‌నే భావిస్తూ త‌మ పార్టీ నేత‌లెవ‌రూ ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కూడ‌ద‌ని పీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌హేశ్‌గౌడ్ మధ్యాహ్నం ఆదేశాలిచ్చారు. కానీ సాయంత్రం జ‌రిగిన స‌భ‌కు తెలంగాణ కాంగ్రెస్ నుంచి భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మ‌హానేత‌ వైఎస్ శిష్యుడిగా పుట్ట‌డం త‌న అదృష్ట‌మ‌ని తెలంగాణ‌లో బీడు భూముల‌ను స‌స్య‌శ్యామలం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దేన‌ని ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆ సభ అనంత‌రం విలేక‌ర్ల‌తో మాట్లాడిన ఆయ‌న త‌న‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వైఎస్ఆర్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని టీపీసీసీ ఆదేశాలు ఇవ్వ‌డం పిచ్చి ప‌ని అని పేర్కొన్న ఆయ‌న‌.. మూడు రోజులుగా నిద్ర‌పోయిన టీపీసీసీ ఈ రోజే లేచిందా అని విమ‌ర్శించారు. మూడు రోజ‌లు క్రిత‌మే వ‌దిన విజ‌య‌మ్మకు వ‌స్తాన‌ని మాటిచ్చాన‌ని వైఎస్‌ను అభిమానించే వ్య‌క్తిగానే స‌భ‌కు వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీ నేత వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లుమొక్కార‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వేడిని పెంచాయి. ప‌రోక్షంగా ఈ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌ను ఉద్దేశించే చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతే కాకుండా అంద‌రిని పిలిచి ఈ విష‌యంపై చ‌ర్చించ‌కుండా అప్ప‌టిక‌ప్పుడు వైఎస్ స‌భ‌కు వెళ్లొద్ద‌ని ఎలా చెప్తార‌ని టీపీసీసీ అలా ప్ర‌క‌టించిన విష‌యం త‌న‌కు తెలీద‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. ఈ విష‌యంపై కావాలంటే పార్టీ అధిష్ఠానంతో మాట్ల‌డ‌తాన‌ని చెప్పారు. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకునేంత సీన్ హైక‌మాండ్‌కు లేద‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి ఉన్న నాయ‌కుల కంటే కూడా తెలుగు దేశం పార్టీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కే ప్రాధాన్య‌త పెరిగింద‌ని వాళ్లే ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి సహా ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల్లో అసంతృప్తి ఓ స్థాయిలో ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా చేసిన దివంగ‌త నేత సంస్మ‌ర‌ణ స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని టీపీసీసీ ఆదేశించ‌డంతో ఆ అసంతృప్తి మ‌రింత పెరిగింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క రాఖీ క‌ట్టి ఆశీర్వాదం తీసుకుంటే త‌ప్పు లేదు కానీ తాను కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి స‌భ‌కు వెళ్తే త‌ప్పా అనే అర్థం వ‌చ్చేలా మాట్లాడిన కోమ‌టిరెడ్డి కుండ బ‌ద్ధ‌లు కొట్టార‌ని నిపుణులు అనుకుంటున్నారు. పార్టీలో సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న రేవంత్ త‌న వ‌ర్గాన్ని బ‌ల‌ప‌ర్చుకోవాల‌నే ప్ర‌యత్నాలు చేస్తున్నార‌నే టాక్ ఉంది. అందులో భాగంగానే సీత‌క్క‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు సీత‌క్క విష‌యాన్ని కోమ‌టిరెడ్డి ప‌రోక్షంగా ప్ర‌స్తావించార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.