Begin typing your search above and press return to search.

టీపీసీసీ చీఫ్ రేవంత్ కాదా.. ఆయ‌నేనా..!

By:  Tupaki Desk   |   21 July 2022 2:30 AM GMT
టీపీసీసీ చీఫ్ రేవంత్ కాదా.. ఆయ‌నేనా..!
X
తెలంగాణ కాంగ్రెస్ శాఖ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాదా..? ఆయ‌న మాట‌కు, చేత‌కు పార్టీలో విలువ లేకుండా పోయిందా..? కొంద‌రు కావాల‌నే ఆయ‌న నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారా..? పార్టీలో చేరిక‌ల విష‌యంలో పుల్లలు పెడుతూ రేవంత్ గ్రాఫ్ పెర‌గ‌కుండా అడ్డుకుంటున్నారా..? అయినా పార్టీ భ‌విష్య‌త్తు కోసం ఆయ‌న మౌనంగా భ‌రిస్తున్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

కేసీఆర్ ధాటికి రెండుసార్లు చెల్లాచెదురైన పార్టీని గ‌ట్టెక్కించేందుకు యువ‌కుడు అయిన రేవంతును అధిష్ఠానం న‌మ్ముకుంది. ఆయ‌న‌కు టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి అంద‌లం ఎక్కించింది. అధిష్ఠానం న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌ని రేవంత్ పార్టీ భ‌విష్య‌త్తు కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు. త‌ను ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏడాది కాలంగా వ‌రుస బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీలు, ర‌చ్చ‌బండ స‌మావేశాల‌తో శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చారు.

తెలంగాణలో అయిపోయింద‌నుకున్న పార్టీని పోటీలోకి తెచ్చారు రేవంత్‌. త‌న వాగ్ధాటితో ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టారు. దూకుడు రాజ‌కీయాల‌తో యువ‌త‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. కాంగ్రెస్ భ‌విష్య‌త్తు ఆశాకిర‌ణం ఆయ‌నేన‌నే విధంగా ఎక్స్‌పోజ్ చేసుకున్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌న్న న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించారు. ఇంతా చేస్తున్నా పంటి కింద రాయిలా.. ప‌క్క‌లో బ‌ళ్లెంలా సీనియ‌ర్ల వ్య‌వ‌హార శైలితో ఇబ్బంది ప‌డుతున్నారు రేవంత్‌.

త‌న ఆధిప‌త్యాన్ని ఆది నుంచీ వ్య‌తిరేకిస్తున్న కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జ‌గ్గారెడ్డి, వీహెచ్ వంటి సీనియ‌ర్ల‌ను మాత్రం క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. పార్టీలో చేరిక‌ల‌ను ప్రోత్స‌హించి అధికార పార్టీని మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్న రేవంతుకు ఆయా జిల్లాలో సీనియ‌ర్లు అడ్డుక‌ట్ట‌వేస్తున్నారు. ముఖ్యంగా కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది అయినా ఇంత వ‌ర‌కూ న‌ల్ల‌గొండ జిల్లాలో అడుగు పెట్ట‌లేక‌పోవ‌డానికి ఆయ‌నే కార‌ణం.

కోమ‌టి రెడ్డి అంత‌టితో ఆగ‌కుండా రేవంత్ నిర్ణ‌యాల‌ను కూడా ప్ర‌భావితం చేస్తున్నారు. రేవంత్‌ జ‌డ్చ‌ర్ల‌లో ఎర్ర‌శేఖ‌ర్ ను చేర్చుకుంటే అనిరుధ్ రెడ్డి త‌న అభ్య‌ర్థంటూ కోమ‌టి రెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. న‌ల్ల‌గొండ జిల్లాలో రేవంత్ వేలు పెట్టొద్దు కానీ రేవంత్‌ సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్లో మాత్రం ఆయ‌న వేలు పెట్టొచ్చా అని కొంద‌రు నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. అలాగే జానారెడ్డికి ప‌రిమితం అయిన మిర్యాల‌గూడ లో కూడా త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించుకున్నారు కోమ‌టి రెడ్డి.

తుంగ‌తుర్తిలో కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించారు. ఇలా అంత‌టా పుల్ల‌లు పెట్టి పార్టీ ప‌రువును దెబ్బ‌తీస్తున్నార‌ని ద్వితీయ శ్రేణి నేత‌లు ఆరోపిస్తున్నారు. డీఎస్, జూప‌ల్లి వంటి పాత కాపులు పార్టీలో ఇంకా చేర‌క‌పోవ‌డానికి వీళ్లే కార‌ణ‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ కాద‌ని కోమ‌టి రెడ్డి అని దెప్పిపొడుస్తున్నారు. మ‌రి వీటిని రేవంత్ ఎలా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.