Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డీ.. బేరమా? రాయబేరమా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:17 AM GMT
కోమటిరెడ్డీ.. బేరమా? రాయబేరమా?
X
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్యంగా గాంధీ భవన్ మెట్లెక్కారు. మూడు నెలల కిందటి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ప్రచారానికి కూడా రాని కోమటిరెడ్డి.. ఆ తర్వాత తనకిప్పుడు ఏ కండువా కూడా లేదని ప్రకటించారు. మధ్యలో బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారాన్ని ఎదుర్కొన్నారు. బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం వంటి అంశాల నేపథ్యంలో కోమట్టిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం నిజమేననే స్థాయికి వెళ్లింది. ఆయన దీన్ని ఖండించను కూడా లేదు.

దీంతో భువనగిరి ఎంపీ ఎటువైపే తెలియని పరిస్థితి. అలాంటిది శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసంతృప్త నేతగా ముద్రపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌కు వచ్చారు. కాగా, ఇటీవల పీసీసీ ప్రకటించిన కమిటీలపై కోమటిరెడ్డి తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఆయనకు స్థానం దక్కకపోవడంతోనే అలా స్పందించారు. అంతేగాక ఆరేడు సార్లు ఓడిపోయిన వారితో తాను కూర్చోవాలా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అంతలోనే గాంధీభవన్ మెట్లెక్కారు. ఇటీవల తిరుమల పర్యటనలో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎన్నికలకు రెండు నెలల ముందు ఏ పార్టీలో చేరుతానో చెబుతానని ప్రకటించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో తీవ్రమైన ప్రకటనలు చేశారు. అందుకే రెండు సార్లు హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ మాటలు తాను అనలేదని మార్ఫింగ్ అని చెప్పుకొచ్చారు. ఇటీవల సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వారికి మద్దతు పలికారు. ఆయన బిజెపిలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

రావడం.. రావడం.. రేవంత్ తో భేటీ గాంధీ భవన్ కు కోమటిరెడ్డి రావడమే అరుదంటే ఆయన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి పీసీసీ చీఫ్ పదవిని గట్టిగా ఆశించిన కోమటిరెడ్డి ఆ పదవి రేవంత్ కు దక్కడంతోనే అలక బూనారు. రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన తాను ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని సవాల్ చేశారు. అ ప్రకారమే బెట్టు మీద ఉన్నారు. అయితే, అనూహ్యంగా గాంధీభవన్ కు రావడమే కాక.. రేవంత్ నూ కలిశారు. తమ మధ్య విభేదాలేమీ లేవన్నట్లు వ్యవహరించడం కాంగ్రెస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.

అసలు కథ అదా..? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రే నియమితులైన తర్వాత తొలిసారి ఇటీవల హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు సీనియర్ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వీటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే, గాంధీ భవన్‌ లో కాక బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు. ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. అయితే, గురువారం రెండోసారి మాణిక్ రావు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు.

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పుకున్నారు. నిజానికి ఇటీవల నియమించిన ఏ కాంగ్రెస్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదు. కానీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పుకున్నారు. మాణిక్ రావు థాక్రేనే తనను రావాలని ఫోన్ చేశారని కోమటిరెడ్డి చెబుతున్నారు.

కోమటిరెడ్డి వ్యవహారాశైలి కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన అనుచరుల్లోనూ పజిల్ గా మారింది. ఇదేమైనా కొత్త వ్యూహమా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తమ్ముడికి ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులను వెంకటరెడ్డి కోరారు. ఇది హై కమాండ్ పరిశీలనకూ వెళ్లింది. ఇక ఎన్నికల ముందు ఆయన ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. పోలింగ్ కు ఒక్క రోజు ఉందనగా తిరిగొచ్చారు.

అయితే, ఇప్పుడు ఒక్కసారిగా గాంధీభవన్ కు రావడం వెనుక ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారా? లేకపోతే కొత్త వ్యూహం ఏదైనా అమలు చేస్తున్నారా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.

పైగా తాను కాంగ్రెస్‌కు దూరంగా లేనని రోజు వారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు. బీజేపీతో కుదరలేదా? బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక నజర్ పెట్టింది. త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈయన తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగుతోంది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీలో చేరాలనుకుంటే ఇదే మంచి సందర్భం.

కానీ, కోమటిరెడ్డి మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లేమీ కనిపించడం లేదు. లేదంటే బీజేపీనే ఆయన చేరికపై ఏమీ తేల్చడం లేదా? అనేది తెలియాల్సి ఉంది. అదీ కాదంటే బీజేపీ తెలంగాణలో గెలిచేది లేదు పెట్టేది లేదు.. అయితే, గియితే కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలు, అలాంటి పార్టీని వదులుకోవడం ఎందుకని రాయబేరాలకు దిగారా? అనేది బయటపడాల్సి ఉంది. ఏదేమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రజా క్షేత్రంలో బలమైన నేతగా పేరుంది. అలాంటి ఆయన ఇమేజ్ ను చేజేతులా పాడుచేసుకుంటున్నారనే పేరుంది. ఇప్పుడు మాత్రం ఓ మెట్టు దిగిరావడం పార్టీకి, ఆయనకు శుభసూచకమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.