Begin typing your search above and press return to search.

బాబు వ‌ల్లే ఓట‌మి.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   5 Jan 2019 2:16 PM GMT
బాబు వ‌ల్లే ఓట‌మి.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌నం
X
తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌పై కాంగ్రెస్ పార్టీ పోస్ట్‌ మార్టం కొన‌సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం వ‌ద్దే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేశారు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌రిగిన స‌మీక్ష అనంత‌రం కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలో జరిగిన అవకతవకల పైన అభ్యర్థులు తమ అభిప్రాయాలను చెప్పామ‌న్నారు. మహాకూటమి వద్దని ఎన్నికల ముందే చెప్పానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పార్లమెంట్ ఎన్నికలో పొత్తు వద్దని సమీక్ష సమావేశంలో చెప్పానని కోమ‌టిరెడ్డి వివ‌రించారు. ``సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం ప‌రిపాలిస్తారని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారు.అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది`` అని క‌ల‌క‌లం సృష్టించే కామెంట్లు చేశారు. `ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుండి 45 స్థానాలు గెలిచే వాళ్ళం. కానీ ఓట‌మి పాల‌య్యాం. నాలాంటి వాళ్ళ ఓటమికి పొత్తులే కారణం.అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల‌తో ఎవరికి టికెట్ వస్తుందో ప్రజలు అయోమయానికి గుర‌య్యారు. నల్గొండ అర్బన్ స్థానంలో పొత్తు ఎందుకు పెట్టుకున్నా ర‌ని మా పార్టీ కార్యక‌ర్త‌లే నన్ను ప్రశ్నించారు. కేసీఆర్ నా నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారు. నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ ఓడిపోయింది` అని పేర్కొన్నారు.

ప్రజకుటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారని టీ ఆర్ ఎస్ ప్రచారం చేసిందని అది నిజ‌మై ప్ర‌జ‌లు కూట‌మికి వ్య‌తిరేకంగా ఓటు వేశార‌ని కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేస్తే 7 నుండి 8 స్థానాలు గెలుస్తామ‌న్నారు. హైకమాండ్ టికెట్ ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా విజయం సాదిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.