Begin typing your search above and press return to search.

కీలక భేటీకి వెళ్లకుండా సోనియాకు కోమటిరెడ్డి లేఖ.. బయటకు ఎలా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 3:49 AM GMT
కీలక భేటీకి వెళ్లకుండా సోనియాకు కోమటిరెడ్డి లేఖ.. బయటకు ఎలా?
X
నిత్య అసంతృప్తివాదిగా పేరు తెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తీరును మార్చుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీకి కీలకమైన మునుగోడు ఉప ఎన్నికల్లో తన అవసరాన్ని గుర్తించిన ఆయన.. ఇప్పుడు పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. పార్టీకి.. సోనియమ్మకు వీర విధేయుడిగా చెప్పుకునే ఆయన.. అదే సోనియాగాంధీ నివాసంలో ఆమె కుమార్తె ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీకి డుమ్మా కొట్టేశారు.

అక్కడితో ఆగని ఆయన.. పార్టీ అధినేత్రి సోనియమ్మకు ఒక లేఖను రాశారు. అయితే.. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలున్న ఈ లేఖ సోనియమ్మకు చేరటానికి ముందే మీడియా చేతికి వచ్చేయటం.. అందులో అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఇదంతా చూస్తుంటే.. ఇప్పటివరకు పార్టీ నేతలపై తన ధిక్కారాన్ని ప్రదర్శించే కోమటిరెడ్డి తాజాగా పార్టీ అధినాయకత్వంపైనా ధిక్కారాన్ని ప్రదర్శించారా? అన్న క్వశ్చన్ వచ్చేలా చేస్తున్నారని చెప్పాలి.

రేవంత్ పైన మొదట్నించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే కోమటిరెడ్డి తాజా లేఖలో.. రేవంత్ రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిందని.. కొత్త పీసీసీ అధ్యక్షుడ్ని నియమిస్తేనే పార్టీ తెలంగాణలో బతుకుతుందని పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేనని లేఖలో స్పష్టం చేయటం గమనార్హం. ఒకవైపు 10, జన్ పథ్ లో నిర్వహించిన కీలక భేటీలో.. కోమటిరెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటిస్తే.. అందుకు విరుద్దంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

ఇక.. సోనియాకు రాసిన లేఖలో కోమటిరరెడ్డి పలు అంశాల్ని ప్రస్తావించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ ఆయన మాట్లాడారు. ఈ రెండింటికి సంబంధించిన కీలక అంశాల్ని చూస్తే..

- ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తాను. అయితే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో పార్టీలోని కొన్ని వర్గాలు కావాలని నన్ను అవమానించడంతో పాటు పని కట్టుకుని దాడులు చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్న నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం మనస్తాపాన్ని కలిగిస్తోంది.

- పార్టీలో కొత్తగా చేరినప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. నేను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయనకు పూర్తి సహకారం అందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. కానీ రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.

- రోజురోజుకూ నాపై పెరుగుతున్న ఈ దాడులు.. పార్టీపై తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. గతంలో ఆయన నాకు చెప్పిన క్షమాపణలను కూడా నేను అంగీకరించాను. కానీ మళ్లీ నాతో పాటు ఇతర సీనియర్లను అవమానించడం వారికి పరిపాటిగా మారింది. నన్ను హోంగార్డులుతో పోల్చిన ఆయన తనకు తాను డైరెక్ట్‌ రిక్రూటీ ఐపీఎస్‌గా చెప్పుకున్నారు.

- నేను పార్టీ విధేయుడిగానే కొనసాగుతాను. కానీ నా పట్ల అవలంబిస్తున్న అవమానపూరిత వైఖరి కారణంగా నేను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.

- తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్‌ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోంది. ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయింది.

- హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వారితో మునుగోడు లోనూ ప్రచారం చేయించుకోవాలి. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్‌ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జులుగా పంపాలి.