Begin typing your search above and press return to search.

వంద త‌ర్వాత క‌విత‌ను గెలిపించుకో కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   7 July 2018 6:17 AM GMT
వంద త‌ర్వాత క‌విత‌ను గెలిపించుకో కేటీఆర్‌?
X
టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ పెరుగోతోంది. వంద సీట్లు ఖాయ‌మ‌న్న మాట‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్ప‌టం.. ఆ త‌ర్వాత మ‌రో అడుగు ముందుకేసి.. ఒక‌టి రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచే అవ‌కాశం లేద‌ని చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి.. మంత్రి కేటీఆర్ కు మ‌ధ్య స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల్లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాస‌మేనంటూ చేసుకున్న‌వ్యాఖ్య‌ల‌తో వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స‌వాళ్ల ఎపిసోడ్ లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి ఎంట‌ర్ అయ్యారు.

నిజామాబాద్ లో మాట్లాడిన కోమ‌టిరెడ్డి.. సోనియ‌మ్మ‌ను బొమ్మా అంటూ కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నార‌న్నారు. ఉత్త‌మ్‌ కుమార్ కు మాట‌మాట‌కు స‌వాళ్లు విస‌ర‌టం కాద‌ని.. ద‌మ్ముంటే త‌న స‌వాల్‌ ను స్వీక‌రించాలంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ద‌మ్ముంటే మంత్రి కేటీఆర్ త‌న సోద‌రి క‌విత‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించుకుంటే తానురాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రిస్తాన‌న్నారు. ఎంపీగా నిజామాబాద్ జిల్లాకు క‌విత చేసిందేమీ లేద‌న్న ఆయ‌న‌.. రానున్న ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మి ఖాయ‌మ‌న్నారు.

శ్రీ‌చైత‌న్య‌.. నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఈ విద్యాసంస్థ‌ల్లో కేసీఆర్ కుటుంబానికి 40 శాతం వాటాలు ఉన్నందునే చ‌ర్య‌ల‌కు వెనుకాడుతున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ స‌ర్కారు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేసింద‌ని.. గ‌న్ మెన్ల‌ను తొల‌గించిన‌ట్లుగా మండిప‌డ్డారు. ఈ నెల 13న కోర్టు తీర్పు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తుంద‌న్నారు. ఎప్పుడూ లేని రీతిలో ఎంపీ క‌విత‌ను సీన్లోకి తీసుకొచ్చిన కోమ‌టిరెడ్డి స‌వాల్‌ కు కేటీఆర్ రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.