Begin typing your search above and press return to search.

రాజ‌గోపాల‌రెడ్డి వెనుక ఉన్న ఆ అదృశ్య శ‌క్తి ఆయ‌నేనా..!

By:  Tupaki Desk   |   27 July 2022 5:30 PM GMT
రాజ‌గోపాల‌రెడ్డి వెనుక ఉన్న ఆ అదృశ్య శ‌క్తి ఆయ‌నేనా..!
X
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌లో హ‌ఠాత్తుగా మార్పు ఎందుకు వ‌చ్చింది..? ఇటీవ‌లే ఠాగూర్ తో పార్టీలోనే ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న స‌డెన్ గా ఎందుకు యూ ట‌ర్న్ తీసుకున్నారు..? ఆయ‌న రాజీనామా చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం వెనుక ఉన్న‌ది ఎవ‌రు..? ఆ అదృశ్య శ‌క్తి ఆయ‌నేనా..? అనే అనుమానాలు కార్య‌క‌ర్త‌ల‌ను తొలుస్తున్నాయి.

ఆ కీల‌క వ్య‌క్తి ఎవ‌రో కాదు.. ఆయ‌న సోద‌రుడు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి అని పార్టీ శ్రేణుల సందేహంగా ఉంది. వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న ఆది నుంచీ అంతుబ‌ట్ట‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. న‌ల్ల‌గొండ స్థానం నుంచి ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ కేబినెట్ లో మంత్రి ప‌ద‌వి నిర్వ‌హించిన వెంక‌ట రెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ప్ర‌తీ ఎన్నిక‌ల్లో ఆయ‌న సూచించిన న‌లుగురైదుగురికి ఎమ్మెల్యే టికెట్లు వ‌చ్చేవి.

ఆయ‌న బాట‌లోనే త‌న సోద‌రుడిని తీసుకొచ్చారు. 2009లో భువ‌న‌గిరి ఎంపీగా, త‌ర్వాత ఎమ్మెల్సీగా.. 2018లో మునుగోడు ఎమ్మెల్యేగా త‌న త‌మ్ముడిని గెలిపించుకున్నారు వెంక‌ట రెడ్డి.

వీరిద్ద‌రూ జిల్లాపై బ‌ల‌మైన ముద్ర వేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌డం.. త‌ర్వాత పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను త‌ప్పించి ఉత్త‌మ్ కు క‌ట్ట‌బెట్ట‌డం వీరి ఆగ్ర‌హానికి గురి చేసింది. త‌మ‌కు రావాల్సిన ప‌ద‌వి ఉత్త‌మ్ కు వెళ్ల‌డంతో అప్ప‌టి నుంచే పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి కుంతియాను బ‌హిరంగంగానే తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు.

2014, 2018 ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ ఓడిపోవ‌డంపై కాంగ్రెస్ ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ జిల్లా నాయ‌కుల అనైక్య‌తే కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. త‌ర్వాతైనా ఉత్త‌మ్ ను త‌ప్పించి త‌మ‌కు అవ‌కాశం ఇస్తార‌ని ఎదురుచూశారు కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. అధిష్ఠానం ఈసారి కూడా వారి సూచ‌న‌ను బేఖాత‌రు చేసి రాష్ట్ర‌వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఇక అప్ప‌టి నుంచీ ఈ సోద‌రులిద్ద‌రూ పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగానే ఉంటున్నారు.

పార్టీని బ‌లోపేతం చేయాల్సింది పోయి అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి రేవంతును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల మౌనంగా ఉండ‌డంతో అంతా స‌ఖ్య‌త‌గానే ఉంద‌ని అంతా భావించారు. అయితే తాజాగా రాజ‌గోపాల‌రెడ్డి మ‌ళ్లీ బీజేపీ పాట ఎత్తుకోవ‌డంతో మొద‌టికొచ్చిన‌ట్లు అయింది. ఆయ‌న రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ను ఎదుర్కొనేందుకే మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. వారం ప‌ది రోజుల్లోఈ నిర్ణ‌యం ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

అయితే.. ఇంత జ‌రుగుతున్నా ఆయ‌న అన్న వెంక‌ట రెడ్డి మౌనంగా ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. త‌మ్ముడిని ఆప‌డం.. విమ‌ర్శించ‌డం వంటివి చేయ‌లేక‌పోతున్నారు. త‌మ్ముడిని అన్నే బీజేపీలోకి కావాల‌ని పంపిస్తున్నారా అనే సందేహాలను శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ్ముడు ఉప ఎన్నిక‌లో.. బీజేపీలో స‌క్సెస్ అయితే త‌నూ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి బీజేపీ వైపు వెళ్ల‌డం.. లేదా త‌మ్ముడు ఓడిపోతే కాంగ్రెస్ లోనే ఉండిపోవాల‌నే నిర్ణ‌యానికి వెంక‌ట రెడ్డి వ‌చ్చార‌ని శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!