Begin typing your search above and press return to search.

నాకు నేనే పోటీ.. నల్గొండపై కోమటిరెడ్డి..

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:21 AM GMT
నాకు నేనే పోటీ.. నల్గొండపై కోమటిరెడ్డి..
X
ఆలూ లేదు.. చూలూ లేదు.. కాంగ్రెస్ కు నేనే సీఎం అన్నాడట ఓ పెద్ద లీడర్. అవును.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకముందే ఆ పార్టీ నేతలు కలలుగనడం ప్రారంభించారు. అది నష్టం జరిగి ఓడిపోయాక కానీ వారికి వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అసలు విషయాన్ని గ్రహించకుండా మళ్లీ పాత పాటే పాడుతున్నారు.

గడిచిన ఎన్నికల్లో గెలవాల్సిన వ్యూహాలు రచించాల్సిందిపోయి.. గెలవకముందే తానే ఎమ్మెల్యే క్యాండిడేట్.. అవసరమైతే తానే సీఎం క్యాండిడేట్ అంటూ కాంగ్రెస్ నేతలు బీరాలకు పోయారు. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవాల్సిందిపోయి సీఎం కుర్చీపై కన్నేసి నిండా మునిగిపోయారు. ఓడిపోయాక కూడా వారిలో మార్పు రాకపోవడం అందరీనీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ - ఉపసర్పంచ్ - వార్డు మెంబర్ల అభినందన సభలో పాల్గొని సంచలన కామెంట్లు చేశారు. సర్పంచ్ లందరికీ అండగా ఉంటానని.. ఓడిపోయిన వారిని అక్కున చేర్చుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. నల్గొండ నుంచి ఎంపీగా తనను గెలిపించే బాధ్యత మీదేనని వారిని కోరారు. నాకు పదవి ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం పనిచేస్తానని.. ఇరవైఏల్లుగా ప్రజలు తనను గుర్తించుకున్నారని అన్నారు. అందుకే ఈసారి ఎంపీగా గెలిపించాలని కోరారు.

ఇలా కోమటిరెడ్డి తనకు తానే యూనానమస్ గా నల్గొండ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనమైంది. కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే.. పార్టీ ఎంపీల లిస్ట్ ఫైనల్ కాకముందే కోమటిరెడ్డి ఇలా నల్గొండ ఎంపీ సీటుపై కర్చీఫ్ వేసేయడం మిగతా కాంగ్రెస్ ఆశవాహుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కాంగ్రెస్ లో ఎవ్వరూ ఏం చేసినా చల్తా అన్న దానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకున్న కోమటిరెడ్డికి ఆ ఆశ తీరలేదు. ఆయనా గెలువలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు.. ఇప్పుడు ఈ ఎంపీ ముచ్చట కూడా తీరుతుందో లేదో చూడాలి మరీ..