Begin typing your search above and press return to search.

టీడీపీ నేతల కోసం వెంపర్లాడొద్దు: రేవంత్ కు కోమటిరెడ్డి హితవు

By:  Tupaki Desk   |   9 Aug 2021 9:18 AM GMT
టీడీపీ నేతల కోసం వెంపర్లాడొద్దు: రేవంత్ కు కోమటిరెడ్డి హితవు
X
టీపీసీసీ చీఫ్ గా కొత్తగా నియమితులైన రేవంత్ రెడ్డికి అన్ని విధాల మద్దతు ఇష్తానని.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని పలు కీలక సూచనలు చేశారు.

కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇటీవల పార్లమెంట్ కారిడార్ లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో తనకు భేటి జరిగిందని.. తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై చర్చించానని కోమటిరెడ్డి తెలిపారు.‘నేను రేవంత్ రెడ్డికి మద్దతు అందించాను. అతడితో పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల వెంట పడి వారిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి బదులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ విశ్వాసంలోకి తీసుకొని గౌరవించాలని నేను రేవంత్ కు చెప్పానని’ కోమటిరెడ్డి తెలిపారు.

పీసీసీ చీఫ్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ విస్మరించడం.. రేవంత్ రెడ్డిని ఎంచుకున్నాక కోమటిరెడ్డి తీవ్రంగా కలత చెందారు. ఇక కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని.. పీసీసీ పదవి అమ్ముడుపోయిందని విమర్శించారు.భవిష్యత్తులో గాంధీ భవన్ లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలు చేసి వెంకట్ రెడ్డి.. మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.. నల్గొండ జిల్లాలో జానారెడ్డి వంటి సీనియర్ నేత ఉన్నప్పటికీ తమ ప్రాభవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ కు చేదు అనుభవాలే మిగిల్చాయి.

కాంగ్రెస్ ను ఏలాలని చూసిన కోమటిరెడ్డి బ్రదర్స్ భగ్గుమన్నారు. ఒకానొక దశలో అదిష్టానాన్ని ధిక్కరించినంత పనిచేశారు. ఇక రాజకీయాలు మాట్లాడేది లేదని..కేవలం తన భువనగిరి ఎంపీ నియోజకవర్గం పరిధికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూనే పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పార్టీని నమ్ముకొని త్యాగాలు చేసిన వారిని కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఏంటని సూటిగానే ప్రశ్నించారు.

నాలాంటి సీనియర్ నాయకుడిని పీసీసీ చీఫ్ పదవికి విస్మరించినందుకు హైకమాండ్‌ పై నేను నిరాశ చెందిన మాట నిజమే. నిజానికి, కాంగ్రెస్‌లో కె. జానా రెడ్డికి కూడా నేను చాలా సీనియర్. కానీ పార్టీ హైకమాండ్ జూనియర్ నాయకుడికి పిసిసి చీఫ్ పోస్ట్ ఇచ్చింది”అని కోమటిరెడ్డి అన్నారు.

అయితే, తాను సోనియా గాంధీ - రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బృందంతో కలిసి పని చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం అన్ని అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు చెల్లిస్తే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని భువనగిరి ఎంపీ ప్రకటించారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతగా సీరియస్ అయ్యి అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అధిష్టానంపై, రేవంత్ రెడ్డిపై తమకేం కోపం లేదంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు పీసీసీ రాలేదన్న కోపంతో కొన్ని మాటలు అన్నానని.. వాటిని పట్టించుకోనవసరం లేదంటూ స్వయంగా ఆయనే తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కొత్త ట్విస్ట్.