Begin typing your search above and press return to search.

టీపీసీసీ రేస్: ఫైనల్‌ లిస్టులో ఉన్నది ఆ ఇద్దరే..

By:  Tupaki Desk   |   22 Dec 2020 3:54 PM GMT
టీపీసీసీ రేస్: ఫైనల్‌ లిస్టులో ఉన్నది ఆ ఇద్దరే..
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేస్ ఆఖరి దశకు చేరుకుంది. చాలా మంది తామున్నామంటూ ముందుకొచ్చి అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇప్పుడు బరిలో కేవలం ఇద్దరే మిగిలారు. ఎల్లుండి కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించే చాన్స్ కనిపిస్తోంది. ముఖ్యమైన నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అభిప్రాయ సేకరణ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణలో ఎక్కువమంది రేవంత్ రెడ్డికి ఓటు వేయగా.. కోమటిరెడ్డి మాత్రం గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తిన బాట పట్టారు. పీసీసీ ఫైనల్ అయ్యిందనే వార్తలు వస్తుండడంతో ఆయన మరోసారి ఢిల్లీకి పయనం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన వంతుగా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సీనియర్ నేతలను ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాసన్ లు బుజ్జగించి నచ్చజెప్పారు. దీంతో ఇద్దరే బరిలో మిగిలారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం 162మంది అభిప్రాయాలు సేకరించగా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి కావాలని కోరినట్లు సమాచారం.

. ఈ నెల 23 లేదా 26న పీసీసీ కొత్త చీఫ్ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాస్ ఫాలోయింగ్, అందర్నీ కలుపుకుపోయే వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి... సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి ఢిల్లీ ప్రయత్నాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎవరి పేరు ప్రకటిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

ముందు రాబోతున్న ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నిక, పలు కార్పొరేషన్లకు ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్‌ అధిష్టానం బలమైన నేత కోసమే ప్రయత్నిస్తోంది. సీనియర్ల అలకను పక్కనబెట్టి అయినా సమర్థుడికే పగ్గాలు అప్పజెప్పాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. ఇప్పటివరకు పార్టీకి జరిగిన నష్టం చాలని.. ఇక ముందైనా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని ఈ కసరత్తు చేస్తోంది. ఫైనల్‌గా అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.