Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి బ్రదర్స్... జగన్ని అవమానించారా...?

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:30 PM GMT
కోమటిరెడ్డి బ్రదర్స్... జగన్ని అవమానించారా...?
X
వైఎస్సార్ ని ఆయన కుటుంబాన్ని అమితంగా ఆరాధించే కోమటి బ్రదర్స్ నోటి వెంట ఇపుడు ఒకటే మాట పదే పదే వస్తోంది. అదేంటి అంటే జైలు నేతలు అని. తాజాగా మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ వెళ్ళి ఆయన బీజేపీ పెద్దలతో చెట్టపట్టాల్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు ఏమిటి అంటే జైలుకెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన పనిచేసే కాంగ్రెస్ లో తాను ఉండ‌లేనని. అలాగే చిల్లర నేతగా కూడా రేవంత్ ని ఆయన పేర్కొన్నారు.

ఇదే వరసలో మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జైలు నేత రేవంత్ అని అంటున్నారు. మరి ఈ జైలు అంటేనే ఇంత బాధగా ఉంటే జైలుకెళ్ళిన రాజకీయ నేతలు అంతా అంతేనా వారు వట్టి వేస్టేనా అని కూడా అంటున్నారు. విషయానికి వస్తే అనాటి రోజులలో మహాత్మాగాంధీ నుంచి చాలా మంది నేతలు జైలుకు వెళ్ళారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో కారణంగా జైలు జీవితం గడిపారు. మరి జైలుకు వెళ్ళిన వారంతా దోషులే అని ఎవరూ చెప్పలేరు.

రాజకీయాల్లో ఉన్న వారి మీద అనేక రకాలైన ఆరోపణలు ఉంటాయి. దాంతో జైలుకు వెళ్ళి కోర్టు విచారణను ఎదుర్కొంటారు. ఆ తరువాత వారి సచ్చీలురుగా కోర్టు తీర్పుతో బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

అందువల్ల జైలుకు వెళ్ళినంత మాత్రాన వ్యతిరేక ముద్ర వేయకూడదు కదా. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం రేవంత్ ని జైలుకెళ్ళారని అంటున్నారు. ఆ మాటకు వస్తే బీజేపీ లో పెద్ద అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జైలుకెళ్ళి వచ్చారు కదా అని ఏకంగా రేవంత్ రెడ్డి అంటున్నారు.

తాను ముప్పయి రోజులు జైలుకెళ్తే అమిత్ షా ఏకంగా తొంబై రోజులు జైలులో ఉన్నారని చెబుతున్నారు. ఇక తాను ఏ హత్యా నేరం మీద జైలుకు వెళ్లలేదని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే అమిత్ షా అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు అనే ఆయన భావన. మొత్తానికి జైలు అన్నదే అతి పెద్ద సమస్యగా ఇపుడు తెచ్చి కోమటి రెడ్డి బ్రదర్స్ మాట్లాడడంతో అటూ ఇటూ తిరిగి జగన్ మీద పడుతోంది. జగన్ కూడా వీళ్ళందరి మీద కంటే కూడా ఎక్కువ టైమ్ జైలులో ఉన్నారు.

ఆయన పదహారు నెలలు జైలులో ఉన్నారు. మరి రేవంత్ ని జైలు నేత అంటున్న కోమటి రెడ్డి బ్రదర్స్ వైఎస్సార్ ఫ్యామిలీని అలాగే అంటున్నారా. అలాగే జగన్ని కూడా అవమానిస్తున్నారా అన్న చర్చ అయితే గట్టిగా వస్తోంది. ఇక్కడ మరో మాట వైఎస్ జగన్, వైఎస్ షర్మిలను బాగా ఇష్టపడే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇపుడు టంగ్ మార్చి రేవంత్ ని తిడుతున్నామని అనుకుంటున్నారు కానీ ఈ హడావుడిలో ఈ రకమైన రాజకీయ దూకుడులో తాము జగన్నే ఇండైరెక్ట్ గా విమర్శలు చెస్తున్నామని అసలు తలవకపోవడమే అతి పెద్ద ట్విస్ట్. ఏది ఏమైనా జైలు నేతలు అంటూ తెలంగాణాలో సాగుతున్న రాజకీయ విమర్శలు, మాటల మంటలు కాస్తా ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తాయా అన్న మాట కూడా ఉంది మరి.