Begin typing your search above and press return to search.

రామోజీ..కోమ‌టిరెడ్డి భేటీ కొత్త పార్టీ కోస‌మేనా?

By:  Tupaki Desk   |   21 Nov 2017 11:30 PM GMT
రామోజీ..కోమ‌టిరెడ్డి భేటీ కొత్త పార్టీ కోస‌మేనా?
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. మీడియా మొఘ‌ల్ రామోజీ రావుతో కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌మావేశ‌మైన‌ట్లు వార్త‌లు రావ‌డమే ఇందుకు కార‌ణం. త‌న సోద‌రుడైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో ఆయ‌న రామోజీతో స‌మావేశ‌మైన‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కార‌ణంగా..కోమ‌టిరెడ్డి బ్రదర్స్ ఒకింత గంద‌ర‌గోళంలో ఉన్నార‌నే వార్తల నేప‌థ్యంలో ఈ భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్‌ లో అసంతృప్తిగా ఉన్నార‌ని ప్రచారం సాగుతోంది. ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిని ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆ ప్ర‌య‌త్నంలో ఫెయిల‌య్యార‌ని టాక్ ఉంది. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల మాజీ ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్‌ తో ఉత్త‌మ్‌ కు ఎర్త్ పెట్టాల‌ని భావించిన‌ప్ప‌టికీ...దిగ్విజ‌య్ ప‌ద‌వి ఊడిపోవ‌డం...ఆయ‌న త‌ర్వాత వ‌చ్చిన ఇంచార్జీ ఆర్‌ సీ కుంతియా..రాబోయే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉత్త‌మ్ సార‌థ్యం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో...కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఒకింత నిరాశ‌ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేర‌డంతో త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని ఈ సోద‌రులు భావిస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉండాలా..లేక‌పోతే త‌మ దారి తాము చూసుకొని బీజేపీలో చేరాలా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. దీంతోపాటుగా ఒక‌వేళ తాము కొత్త పార్టీ పెట్ట‌డం అనేది స‌రైన‌దేనా? అనే విష‌యంలో కూడా చ‌ర్చ‌లు సాగిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.