Begin typing your search above and press return to search.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సీట్లపై కోమటిరెడ్డి లెక్క ఇదే

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:30 AM GMT
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సీట్లపై కోమటిరెడ్డి లెక్క ఇదే
X
తెలంగాణ రాజకీయాల్లో తరచూ వినిపించే పేర్లలో ఒకటి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ కు ఆయనో బలమని పలువురు చెబితే.. ఆయనే పార్టీకి పెద్ద బలహీనం అని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. తరచూ పార్టీ మీదా.. పార్టీ నియమించిన రాష్ట్ర అధ్యక్షుడి మీద అసంతృప్తి ప్రకటిస్తూ.. తరచూ వార్తల్లో నిలిచే ఆయన కారణంగా పార్టీకి నష్టమే తప్పించి లాభమే ఉండదని చెబుతారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటేనే ఒక పట్టాన పడని కోమటిరెడ్డి.. ఆయన్నుఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేయటం.. పంచ్ లు వేయటం చేస్తుంటారు. మరి.. అలాంటి ఆయన్ను కాంగ్రెస్ వదిలించుకోవచ్చు కదా? అంటే.. బాగా బతికిన కాంగ్రెస్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే ఛాన్సు లేదు. దీంతో.. కోమటిరెడ్డి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.

గాంధీ భవన్ కు రాని ఆయన.. ప్రజల్లోకి సైతం పెద్దగా వెళ్లటం కనిపించదు. కానీ.. మీడియాలో మాత్రం మాట్లాడుతూ.. తాను కేంద్రంగా కాంగ్రెస్ వ్యవహారాలు నడిచేలా ప్రభావితం చేస్తుంటారు. నెలల తరబడి గాంధీ భవన్ ముఖం చూడని ఆయన.. తాజాగా గాంధీ భవన్ కురావటంతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రేను నియమించిన నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు కోమటిరెడ్డి గాంధీభవన్ కు వచ్చారు.

ఈ సందర్భంగా ఠాక్రేతో భేటీ అయిన ఆయన.. పీసీసీ చీఫ్ రేవంత్ ను కూడా కలిశారు. నిప్పు.. ఉప్పు మాదిరి ఉండే ఈ ఇద్దరు నేతల మధ్య భేటీలో ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ తో భేటీ అనంతరం కొన్ని మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలం ఎంతన్న విషయాన్ని చెబుతూ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లు వస్తాయంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

ఇటీవలకాలంలో ప్రజల్లో ఉండని కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇంత భారీగా సీట్లు గెలిచే ఛాన్సు ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. కోమటిరెడ్డి నోటి నుంచి వచ్చిన లెక్కలు ఆసక్తికరంగా మారాయని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.