Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి బీజేపీలోకి జంప్‌.. డేట్ ఫైన‌ల్‌?

By:  Tupaki Desk   |   12 March 2022 2:30 PM GMT
కోమ‌టిరెడ్డి బీజేపీలోకి జంప్‌.. డేట్ ఫైన‌ల్‌?
X
కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపేలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారా? ఆ పార్టీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. అందుకే గ‌త కొంత‌కాలంగా సైలెంట్ ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు ఉన్న‌ట్లుండి అధిష్టానంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తోనే కాంగ్రెస్‌కు తాను దూరంగా ఉంటున్నాన‌ని రాజ‌గోపాల్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ల‌కు కాకుండా టీడీపీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు ప‌ద‌వులిస్తే ఏం లాభ‌మ‌ని ప‌రోక్షంగా రేవంత్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఉన్న‌వాళ్ల‌ను కాద‌ని..
మొద‌టి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్న‌వాళ్ల‌ను కాద‌ని టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో అధిష్ఠానంపై ఆ పార్టీ నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులోనూ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మ‌రింత‌గా రెచ్చిపోయారు. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న హైక‌మాండ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్ ద‌గ్గ‌ర నుంచి రూ.కోట్ల డ‌బ్బు తీసుకుని ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శించారు.

ఆయ‌న సోద‌రుడు రాజ‌గోపాల్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ మ‌రీ బ‌య‌ట‌ప‌డ‌లేదు. కానీ ఇప్పుడు ఒక్క‌సారిగా త‌న ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కారు. కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి ఉన్న‌వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే సీనియ‌ర్ నాయ‌కులు దూరమ‌వుతార‌ని రాజ‌గోపాల్‌రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. తాను పార్టీని వీడుతున్నాన‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారా? అన్న‌ది సందేహంగా మారింది.

ఎప్ప‌టి నుంచో..
గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి యాక్టివ్‌గానే క‌నిపించారు. కానీ తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్య‌క్ష ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తూ సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయ‌న బీజేపీలో చేర‌నున్నార‌నే ప్రచారం అప్ప‌టి నుంచే జోరుగా వినిపిస్తోంది. మ‌రోవైపు రాజ‌గోపాల్‌రెడ్డి కూడా ఈ ఊహాగానాల‌ను ఖండించ‌లేదు. దీంతో ఆయ‌న బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారనే అనుమానాలు క‌లిగాయి.

ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం.. అయిదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. జాతీయ రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్ లేని కాంగ్రెస్‌కు రాష్ట్రంలోనూ ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్క‌ద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలిసింది. అందుకే తెలంగాణ‌లో బ‌లోపేతం దిశ‌గా సాగుతున్న‌బీజేపీలో చేరిక‌కు డేట్ కూడా ఫైన‌ల్ చేశార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.