Begin typing your search above and press return to search.

దీక్ష వేళ షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్.. సంకేతాలేంటి?

By:  Tupaki Desk   |   28 July 2021 6:59 AM GMT
దీక్ష వేళ షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్.. సంకేతాలేంటి?
X
నిత్యం కాంగ్రెస్ పార్టీనీ స్మరిస్తూ.. ఆ పార్టీ ఎదుగుదల కోసం తనకు మించిన కమిట్ మెంట్ మరెవరికీ లేదన్నట్లుగా వ్యవహరించటం కోమటిరెడ్డి బ్రదర్స్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఓవైపు పార్టీ గురించి మాట్లాడే వారు.. మరోవైపు పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించటం వారికి కొత్తేం కాదు. తరచూ వారు ఇదే తీరును ప్రదర్శిస్తూ ఉంటారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులు పోటీ పడటం.. అది కాస్తా రేవంత్ చేతికి అప్పజెప్పటం తెలిసిందే. పీసీసీ చీఫ్ పదవి ప్రకటన వెలువడినంతనే మండిపడిన కోమటిరెడ్డి బ్రదర్స్.. ఆ తర్వాత సర్దుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా.. తనదైన శైలిలో చురకలు వేస్తున్న వారు తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు.

తాజాగా వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షను తమ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని పుల్లెం గ్రామంలో నిర్వహించారు. దీన్నో అవకాశంగా తీసుకున్నఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ చీఫ్ రేవంత్ పై విమర్శలు చేస్తున్న షర్మిలకు ఆయన ఫోన్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగ దీక్షకు తాను కూడా మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీక్షలో ఉన్న షర్మిలకు ఫోన్ చేసిన ఆయన.. ఆమెతో మాట్లాడారు.

‘నమస్తే షర్మిలమ్మ.. మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మా నియోజకవర్గంలో మీరు నిరుద్యోగుల కోసం ఒకరోజు దీక్ష చేపట్టినందుకు మీకు హృదయపూర్వక సంఘీభావం తెలియజేస్తున్నా. మీరు అనుకున్నది సాధించాలి. మాకు రాజశేఖర్ రెడ్డి ప్రాణం. మేం బతికి ఉన్నంతవరకు ఆయన మా గుండెల్లో ఉంటారు. మునుగోడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు రూ.750 కోట్లతో ప్రాజెక్టు ఇచ్చారు. 90 శాతం పూర్తి అయిన ఆ ప్రాజెక్టును ఇప్పటికి పూర్తి చేయలేదు. మా ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన కోసం ప్రాణం ఇచ్చేంతగా అభిమానిస్తారు. మీరు సక్సెస్ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిరుద్యోగుల తరఫున మీరు తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్నా’’ అని ఆమెతో మాట్లాడారు.

తాను ఉదయమే ఢిల్లీకి వచ్చానని.. లేకుంటే మిమ్మల్నికలిసేవాడినని షర్మిలకు రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆయన మాటలకు స్పందించిన షర్మిల.. థ్యాంక్స్ అన్నా అని చెప్పినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి ప్రతినిధిగా షర్మిల పార్టీనే పెట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఎటువైపు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

షర్మిల పరా్టీ పెట్టిన రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లి వైఎస్ అభిమానులతో మాట్లాడటం గుర్తుండే ఉంటుంది. తాజాగా షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు.. ఆయన సోదరుడుస్వయంగా ఫోన్ చేయటం చూస్తుంటే.. ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడే కాకున్నా.. సమయం, సందర్భం చూసుకొని వారి నిర్ణయాలు వెలువడే అవకాశంఉందంటున్నారు. అప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రేవంత్ రెడ్డికి చురకలు అంటిస్తూ ఉంటారన్న మాట వినిపిస్తోంది. మరీ.. వాదన ఎంతవరకు నిజమన్నది కాలమే నిర్ణయించాలి.